అమరావతి : సీనియర్ సీటు గల్లంతేనా ?

Vijaya

పార్టీకి గుదిబండలుగా తయారైన సీనియర్లను వదిలించుకోవాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయినటున్నారు. అందుకనే పొత్తులని, సర్వేలని, గెలుపు గుర్రాలని ఏదో పేరుచెప్పి సీనియర్లను పోటీలో నుండి తప్పిస్తున్నారు. నిజానికి సీనియర్లకు టికెట్ లేకుండా చేయటంలో చంద్రబాబు కన్నా లోకేష్ పట్టుదలే ఎక్కువగా ఉందని పార్టీవర్గాల సమాచారం. ఇపుడు విషయం ఏమిటంటే సీనియర్ తమ్ముళ్ళల్లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలోని  మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఒకళ్ళు. టీడీపీ మొత్తంమీద ఈయనకు ఘనమైన చరిత్ర ఒకటుంది.



అదేమిటంటే సర్వేపల్లి నియోజకవర్గం నుండి వరుసగా ఐదు ఎన్నికల్లో ఓడిపోవటం. ఎన్నికల్లో ఓడిపోవటం, పార్టీ అధికారంలోకి వస్తే ఎంఎల్సీ తీసుకుని మంత్రివర్గంలో చోటు దక్కించుకోవటం. నాలుగు జనరల్ ఎన్నికలతో పాటు ఒక ఉపఎన్నికలో సోమిరెడ్డి ఓడిపోయారు. ఇన్నిసార్లు సోమిరెడ్డి ఓడిపోతునే ఉన్నా చంద్రబాబు మాత్రం ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తునే ఉన్నారు. అలాంటిది రాబోయే ఎన్నికల్లో ఈ సీనియర్ కు టికెట్ లేనట్లే అని సమాచారం. ఎలాగంటే సర్వేపల్లిలో 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారని చంద్రబాబు వాయిస్ తో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతోంది.



ఈ సర్వేలో రూప్ కుమార్ యాదవ్  అయితే 1 నొక్కండని, నోటా అయితే 2 నొక్కండని వినిపిస్తోంది. సర్వేలో చంద్రబాబు అసలు సోమిరెడ్డిని పరిగణలోకి కూడా తీసుకోలేదని తేలిపోయింది. ఇంకా విచిత్రం ఏమిటంటే రూప్ కుమార్ యాదవ్ అంటే నెల్లూరు సిటి ఎంఎల్ఏ, మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ బాబాయ్. పదిరోజుల క్రితంవరకు వైసీపీలోనే ఉన్నారు. నెల్లూరు సిటి టికెట్ దక్కలేదనే కోపంతో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పదిరోజుల క్రితం టీడీపీలో చేరిన యాదవ్ కు టికెట్ విషయంలో చంద్రబాబు అభిప్రాయసేకరణ చేస్తున్నారు.



అంటే సోమిరెడ్డికి టికెట్ లేనట్లే అని అర్ధమవుతోంది. సర్వేపల్లిలో టికెట్ దక్కటంలేదంటే జిల్లాలో ఎక్కడ కూడా పోటీచేసే అవకాశం లేనట్లే. ఒకవైపేమో సోమిరెడ్డి తనింట్లో మద్దతుదారులు, క్యాడర్ తో మీటింగ్ పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇంకోవైపేమో చంద్రబాబు రూప్ కుమార్ యాదవ్ కు టికెట్ విషయంలో సర్వే చేయిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: