ఉత్తరాంధ్ర : ‘చీపురు’ దెబ్బకు తమ్ముళ్ళు పారిపోతున్నారా ?

Vijaya

హెడ్డింగ్ చూసి పొరబాటుపడకండి. చీపురంటే ఇల్లుఊడ్చే చీపురు కాదు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పోటీచేయటానికి ప్రస్తుతం టీడీపీ తరపున నేతలెవరు చంద్రబాబునాయుడుకు దొరకటంలేదు. ఎవరిని పోటీచేయమని అడుగుతున్నా చేయమంటే చేయమంటున్నారు. కారణం ఏమిటంటే ఇక్కడి నుండి మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తుండటమే. ఆర్ధిక, అంగబలాల్లో అత్యంత పటిష్టంగా ఉన్న బొత్సాను ఢీకొనాలంటే మామూలు విషయంకాదు. అందుకనే తమ్ముళ్ళు పోటీచేయటానికి ఇష్టపడటంలేదు. దాంతో ఏమిచేయాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు.



విశాఖపట్నం ఉత్తరంనియోజకవర్గం ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావుకు రాబోయే ఎన్నికల్లో ఎక్కడినుండి పోటీచేయాలనేది పెద్ద సమస్యయ్యింది. ఎందుకంటే గంటా ప్రతిఎన్నికకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చేస్తుంటారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఇప్పటికి నాలుగు నియోజకవర్గాలు మారారు.  పోటీచేసిన నాలుగు నియోజకవర్గాలతో పాటు మూడు రిజర్వుడు నియోజకవర్గాలను తీసేయాలి. మూడు చోట్ల చంద్రబాబు అభ్యర్ధులను ప్రకటించేశారు.  ఎక్కడో ఒకచోట నుండి పోటీచేయాలని అనుకున్నారు. రెండు నియోజకవర్గాలను జనసేనకు ఇవ్వబోతున్నారనే ప్రచారం తెలిసిందే. మిగిలిన మూడు స్ధానాల్లో నేతలు తమ సీటును త్యాగంచేయటానికి ఇష్టపడలేదు.



అందుకనే గంటాను చీపురుపల్లిలో పోటీచేయమని చంద్రబాబునాయుడు ఆదేశించారు. అయితే బొత్సాకు వ్యతిరేకంగా పోటీచేసి గెలుస్తామనే నమ్మకం గంటలో లేదు. కాబట్టే పోటీచేయనని చెప్పేశారు. గంటా విషయం తేలిపోవటంతో మాజీమంత్రి కళావెంకటరావును పోటీచేయమని చంద్రబాబు చెప్పారు. అయితే కళావెంకటరావు కూడా కుదరదంటే కుదరదు పొమన్నారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని చంద్రబాబు తాజాగా మీసాలగీతను పోటీచేయమని అడుగుతున్నారు. అయితే గీతకూడా బొత్సాకు వ్యతిరేకంగా పోటీచేయటానికి ఇష్టపడటంలేదని పార్టీవర్గాల సమాచారం.



చీపురుపల్లిలో ఎవరిని పోటీచేయమని అడిగినా అందరు వద్దని తప్పుకుంటున్నారు. అందుకనే ఎవరిని పోటీచేయించాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. పార్టీ తరపున పోటీచేయటానికి ఎవరు ఇష్టపడకపోతే చీపురుపల్లి నియోజకవర్గాన్ని చివరకు జనసేనకు ఇచ్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఒకసీటు అదనంగా ఇచ్చినట్లుంటుంది, బరువు దింపుకుని పరువూ దక్కించుకున్నట్లుంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే బొత్సాకు వ్యతిరేకంగా వైజాగ్ జిల్లా వాళ్ళూ పోటీచేయటంలేదు, విజయనగరం జిల్లా వాళ్ళూ పోటీకి ఇష్టపడటంలేదు. మొత్తానికి చీపురుపల్లిలో బొత్సాకు వ్యతిరేకంగా ఎవరు పోటీచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: