సింగరేణి అంటే బొగ్గే కాదు.. ఈ బ్రహ్మాస్త్రం కూడా?

Chakravarthi Kalyan
సింగరేణి అంటే గుర్తొచ్చేది బొగ్గు గనులే. స్వాతంత్ర్యం రాక ముందు నుంచి ఉన్న ఈ సింగరేణి సంస్థ తెలంగాణలో అనేక జిల్లాల్లో ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు సింగరేణి మరో రంగంలోనూ పాపులర్ అవుతోంది. అదే సౌర విద్యుత్. ఇప్పటికే  సింగరేణి వ్యాప్తంగా 234 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతోంది.

కంపెనీ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కొత్తగా సింగరేణి సంస్థ చేపట్టనున్న సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులపై చర్చలు సాగిస్తోంది. సోలార్ విద్యుత్తు పెంపుదలకు కృషి చేయాలని ఇటీవల రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు కూడా. దీంతో భారీ జలాశయాలైన లోయర్ మానేరు డ్యాం పైన 300 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్, మల్లన్న సాగర్ జలాశయం పైన 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు తగు సన్నాహ చర్యలుతీసుకోవాలని  సింగరేణి భావిస్తోంది.

అలాగే లోయర్ మానేర్ డ్యాంపై 300 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధంగా ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నిర్మాణం చేపట్టడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. మల్లన్న సాగర్ జలాశయంపై ఏర్పాటు చేయ తలపెట్టిన  రెండు 250 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి డిపిఆర్ లు రెడీ చేస్తున్నారు. తెలంగాణలోనే కాదు.. రాజస్థాన్ రాష్ట్రంలోనూ సింగరేణి సౌర విద్యుత్‌ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. అక్కడ చేయతలపెట్టిన 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కు సంబంధించిన కార్యాచరణ రెడీ అవుతోంది.

తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరిగే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, తద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు సింగరేణి సోలార్ విద్యుత్తును ఎక్కువగా కొనే అవకాశం ఉంటుందని సింగరేణి భావిస్తోంది. ధర్మల్‌ విద్యుత్, సోలార్‌ విద్యుత్ మాత్రమే కాదు.. వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు చేయటానికి అవకాశం గల ప్రాంతాలను కూడా గుర్తించనుంది. దీనికి ఒక నివేదిక కూడా రెడీ అవుతోంది. కాలంతో మారుతున్న సింగరేణిని అభినందించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: