గోదావరి : జోగయ్యంటే ఇరిటేషన్ పెరిగిపోయిందా ?

Vijaya

తనను పదేపదే ప్రశ్నిస్తున్న కాపు కురువృద్ధుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఇరిటేషన్ బాగా పెరిగిపోయినట్లుంది. పవన్  వైఖరి ఏమిటంటే తాను ఎవరినైనా ప్రశ్నిస్తాను కాని తనను మాత్రం ఎవరు ప్రశ్నించకూడదన్నట్లుగా ఉంది. పైగా తాను పార్టీ పెట్టింది  జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించటానికి మాత్రమే అని పవన్ చాలాసార్లు నిరూపించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తులో జనసేన 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్ధానాల్లో పోటీచేయబోతోంది.



24 అసెంబ్లీలను పవన్  తీసుకోవటంపై పార్టీతో పాటు కాపుసామాజికవర్గంలో కూడా బాగా మంట పెరిగిపోతోంది. చంద్రబాబునాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకునే పవన్ 24 సీట్లకు అంగీకరించినట్లు ఆరోపణలు, సెటైర్లు పెరిగిపోతున్నాయి. వీటిని పవన్ అస్సలు  తట్టుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జోగయ్య ఒక లేఖను పవన్ను ఉద్దేశించి  విడుదలచేశారు. ఆ లేఖలో జోగయ్య లేవనెత్తిన పాయింట్లకు కాపుల నుండి మద్దతు పెరిగిపోతోంది. ఇవన్నీ పవన్ దృష్టికి వెళ్ళినట్లుంది. అందుకనే పేరు ప్రస్తావించకుండానే జోగయ్యపై విరుచుకుపడ్డారు.



తనకు సూచనలు, సలహాలు ఇవ్వద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సలహాలు, సూచనలు తనకు అవసరంలేదన్నారు. ఇక నుండి తనకు ఎవరు కూడా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అవసరంలేదని కూడా తేల్చిచెప్పేశారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏమిచేసినా గుడ్డిగా మద్దతుగా నిలబడే వాళ్ళున్నట్లు పవన్ చెప్పారు. జగన్ నిర్ణయాన్ని పార్టీలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నించటంలేదన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. మరి జనసేనలో మాత్రం తన నిర్ణయాలను ఎందుకు అందరు పదేపదే ప్రశ్నిస్తున్నారంటు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు.



ప్రతి విషయంలోను తనను నిలదీస్తున్న, ప్రశ్నిస్తున్న వాళ్ళు పార్టీని గెలిపించగలరా అంటు సూటిగా ప్రశ్నించారు. తాను దుష్టుడు, దుర్మార్గుడైన జగన్ తో పోరాటం చేస్తున్న విషయం తనను ప్రశ్నిస్తున్న వాళ్ళకి గుర్తుందా అని నిష్టూరాలాడారు. ఇక్కడ విషయం ఏమిటంటే జనసేన 24 సీట్లు మాత్రమే తీసుకోవటాన్ని పవన్ సమర్ధించుకోలేకపోతున్నారు. అందుకే ప్రశ్నిస్తున్నవారిపై  అడ్డదిడ్డంగా ఎదురుదాడికి దిగినట్లు అర్ధమైపోతోంది. పవన్ వైఖరిపై జోగయ్య తాజాగా మరో లేఖను సంధించారు. బహిరంగసభలో చంద్రబాబు, పవన్ మాట్లాడిన మాటలను జోగయ్య తన లేఖలో తప్పుపట్టారు. తన సూచనలు, సలహాలు చంద్రబాబు, పవన్ కు నచ్చకపోతే వాళ్ళ ఖర్మని జోగయ్య చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: