అమరావతి : స్పీకర్ పని అయిపోయిందా ?

Vijaya

ఎవరికీ ఇబ్బందిలేని పద్దతిలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ బ్యాలెన్స్ చేసినట్లున్నారు. విషయం ఏమిటంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎనిమిదిమంది ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేశారు. దాదాపు నెలరోజులుగా అనర్హత వేటుపై స్పీకర్ వైసీపీ, టీడీపీలోని ఫిరాయింపు ఎంఎల్ఏలపై విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. చాలాసార్లు నోటీసులు ఇచ్చిన స్పీకర్, వాళ్ళ వాదనలు విన్నతర్వాత ఫైనల్ గా మొత్తం ఎనిమిదిమందిపైనా అనర్హత వేటువేశారు.



టీడీపీ తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏలకు చంద్రబాబునాయుడుతో విభేదాలు రావటంతో వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాలిగిరి, గణేష్ వైసీపీకి దగ్గరయ్యారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే వీళ్ళెవరు వైసీపీలో చేరలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డితో పడని కారణంగా నలుగురు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పార్టీకి దూరమై టీడీపీలో చేరారు. దాంతో రెండుపార్టీల్లోను తమ పార్టీ ఎంఎల్ఏలపై అనర్హత  వేటువేయాలని స్పీకర్ కు లేఖలు రాశారు.  ఆ లేఖల ఆధారంగా విచారణ చేసి చివరకు ఎనిమిదిమందిపైనా అనర్హత వేటువేశారు.



నిజానికి ఇపుడు అనర్హత వేటు వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే. ఎందుకంటే మరో 15 రోజుల్లో 2024 ఎన్నికలకు నోటిపికేషన్ రాబోతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ దశలో ఎంఎల్ఏలపై అనర్హతవేటు వేయటం వల్ల రెండుపార్టీలకు లాభము లేదు నష్టమూలేదు. అయినా వేటు వేశారంటే నిబంధనలప్రకారం తమప్రభుత్వం నడుచుకుందని చెప్పుకునేందుకే. రెండుపార్టీల ఎంఎల్ఏల మీదా అనర్హత వేటుపడింది కాబట్టి ఎవరూ స్పీకర్ ను తప్పుపట్టే అవకాశంలేదు.



ఒకేసారి ఎనిమిదిమంది ఎంఎల్ఏల మీద అనర్హత వేటువేయటం అసెంబ్లీ చరిత్రలో ఇదే మొదటిసారేమో. 2014-19 మధ్య వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను ప్రలోభపెట్టి చంద్రబాబునాయుడు టీడీపీలోకి లాక్కున్న విషయం తెలిసిందే. వైసీపీ ఎంఎల్ఏల ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఎన్ని ఫిర్యాదులు చేసినా అప్పట్లో స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు పట్టించుకోలేదు. అప్పట్లో వైసీపీ ఎంఎల్ఏలందరు చంద్రబాబునాయుడు సమక్షంలోనే టీడీపీ కండువాలు కప్పుకున్నారు.అయినా ఎవరిపైనా అనర్హత  వేటు పడలేదు. కాని ప్రస్తుత స్పీకర్ తమ్మినేని మాత్రం రెండుపార్టీల ఎంఎల్ఏల మీద అనర్హత వేటు వేసి బ్యాలెన్స్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: