అమరావతి : హడావుడి లిస్టుకు అసలు కారణమిదేనా ?

Vijaya


తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీల తరపున పోటీచేయబోయే అభ్యర్ధులతో మొదటి జాబితా విడుదలైంది. చంద్రబాబునాయుడు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్ళారు. ఇద్దరు కలిసి మొదటిజాబితాను విడుదలచేశారు. ఇన్నిరోజులు పొత్తు విషయమై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై వెయిట్ చేసిన చంద్రబాబు, పవన్ సడెన్ గా ఎందుకింత హడావుడిగా మొదటి లిస్టును ప్రకటించినట్లు ? బీజేపీతో పొత్తు తేలలేదు, సీట్ల సర్దుబాటు కాలేదు. బీజేపీ విషయం తేలకుండానే చంద్రబాబు, పవన్ ప్రకటించిన జాబితా అసంపూర్ణమనే చెప్పాలి.



ఈ విషయం తెలిసినా కూడా ఎందుకు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారంటే తాడేపల్లిగూడెం బహిరంగసభను దృష్టిలో పెట్టుకునే అనిపిస్తోంది. ఒకవైపు ఎన్నికలకు సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికి మూడు సభలు నిర్వహించి మార్చి 3వ తేదీన నాలుగో సభకు రెడీ అవుతున్నారు. ఇటుచూస్తే టీడీపీ కూటమిలో పొత్తులే ఫైనల్ కాలేదు. టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోందనే సమయంలో సడెన్ గా బీజేపీ మధ్యలో దూరటంతో ఎక్కడిచర్చలు అక్కడే ఆగిపోయాయి.



తర్వాత చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా తో చర్చలు జరిపినా ఫలితం ఏమిటో తెలీదు. ఇంతలో హడావుడిగా మొదటిజాబితాను విడుదల చేసేశారు. కారణం ఏమిటంటే అభ్యర్ధులను ప్రకటించకుండా సభలు పెడితే ఫ్లాప్ అవుతాయనే టెన్షన్ చంద్రబాబు, పవన్లో పెరిగిపోతోందట. ఓ నియోజకవర్గంలో సభ పెట్టాలంటే అక్కడ అభ్యర్ధి ఎవరనేది ముందు తేలాలి. అది తేల్చకుండా సభ నిర్వహణకు ఏర్పాట్లుచేయమంటే ఏ నేత కూడా చేయరు. సరైన ఏర్పాట్లు జరగకపోతే సభలు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. సభలు అట్టర్ ఫ్లాప్ అయితే రేపటి ఎన్నికల గెలుపోటములపై దాని ప్రభావం కచ్చితంగా పడుతుంది.



28వ తేదీ తాడేపల్లిగూడెం బహిరంగసభ అయినా తర్వాత నిర్వహించబోయే సభలైనా సక్సెస్ కావాలంటే ముందు అభ్యర్ధులను ప్రకటించాల్సిందే అని ఇద్దరు అధినేతలు నిర్ణయించుకున్నారు. అందుకనే ఇంత హడావుడిగా మొదటిజాబితాను ప్రకటించింది. మరి జాబితాను ప్రకటించిన తర్వాత సీట్లు కోల్పోయిన వాళ్ళ రియాక్షన్ను వీళ్ళిద్దరు ఊహించినట్లు లేరు. అందుకనే వీళ్ళకి షాక్ కొట్టింది. జాబితాను ప్రకటిస్తే ఒక సమస్య, ప్రకటించకపోతే మరో సమస్యన్నట్లుగా తయారైంది వీళ్ళ వ్యవహారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: