కుప్పం నుంచి భువనేశ్వరి పోటీ నిజమేనా?

Chakravarthi Kalyan
ఎన్నికల వేళ విచిత్ర ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈసారి ఎన్నికల్లో తాను కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సభికులంతా హర్షధ్వానాలు చేశారు. ఈలలు, చప్పట్లతో ఆమెకు వెల్ కం చెప్పారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. 1989 నుంచి ఆయన కుప్పం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అక్కడ ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. ఈ సారి కూడా పోటీకి సిద్ధం అవుతున్న సందర్భంలో అనూహ్యంగా నారా భువనేశ్వరి కుప్పం వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఆమె చేపడుతున్న నిజం గెలవాలి యాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని రెండు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీడీపీ తరఫున ఆర్థిక సాయం అందిస్తూ కుప్పం పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికులను ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆమె తనకు మనసులో ఒక కోరిక కలిగిందంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకి ఈసారి కుప్పంలో విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు.  దీంతో అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు.

దీంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి కుప్పంలో చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని జగన్ వ్యూహాలు పన్నుతున్నారు. ఓడిపోతారనే తెలిసి చంద్రబాబు పోటీ నుంచి తప్పుకుంటున్నారని వైసీపీ సోషల్ మీడియా విభాగం ట్రోల్ చేస్తోంది. అయితే చంద్రబాబు తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాకపోతే భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు మామూలుగా చెప్పినవే. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబే  కుప్పం బరిలో ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: