గోదావరి : ముద్రగడను పవన్ అవమానించారా ?

Vijaya


కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవమానించారా ? కాపు సామాజికవర్గంలో ఇపుడీ విషయంపైనే చర్చ జరుగుతోంది. కారణం ఏమిటంటే రెండురోజుల పాటు తూర్పుగోదావరిలో పర్యటించిన పవన్ ఒక్కసారిగా ముద్రగడను కలవాలని అనుకోకపోవటమే. రెండునెలలుగా ముద్రగడ జనసేనలో చేరుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీలోని కీలకనేత బొలిశెట్టి శ్రీనివాస్ పనిగట్టుకుని ఉద్యమనేత ఇంటికి వెళ్ళి జనసేనలో చేరమని ఆహ్వానించారు.



అనేకసార్లు చర్చలు జరిగిన తర్వాత చివరకు ముద్రగడ పార్టీలో చేరటానికి అంగీకరించారు. అయితే ఇక్కడే ఒక షరతు కూడా పెట్టారట. అదేమిటంటే తనతో పాటు తన కొడుకు ముద్రగడ గిరికి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని. అందుకు పవన్ ఏమిచెప్పారో తెలీదు కాని ముద్రగడ కాకినాడ ఎంపీగాను, కొడుకు గిరి పిఠాపురం ఎంఎల్ఏగా పోటీచేస్తారని విపరీతంగా ప్రచారం జరిగింది. ఒకవైపు జనసేన నేతలు ఉద్యమనేతతో భేటీ అయిన రోజుల్లోనే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడతో భేటీ అయ్యారు.



దాంతో ముద్రగడ ఏ పార్టీలో చేరుతారనే ఉత్కంఠ అప్పట్లో బాగా పెరిగిపోయింది. అయితే మీడియాతో గిరి మాట్లాడుతు తాము జనసేనలో చేరబోతున్నట్లు చెప్పారు. తండ్రితో పాటు తాను కూడా ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. దాంతో ముంద్రగడ కుటుంబం జనసేనలో చేరటం ఖాయమనే అనుకున్నారు అందరు. అయితే ఇదంతా జరిగి రెండు నెలలు అవుతున్నా ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు పడలేదు.



తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ముద్రగడ ఇంటికి పవన్ స్వయంగా వెళ్ళి పార్టీలోకి ఆహ్వానిస్తారని జనసేన నేతలు చెప్పారు. ఏమోలే ముద్రగడ స్ధాయికి మంచి ఆహ్వానమే అని అనుకున్నారు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు పవన్ రెండుసార్లు రాజమండ్రి చుట్టు పక్కల  టీడీపీ నేతల ఇంటికి వెళ్ళినా ముద్రగడ ఇంటికి మాత్రం వెళ్ళలేదు. ముద్రగడను పార్టీలోకి చేర్చుకునే విషయంలో చంద్రబాబునాయుడు అభ్యంతరం వ్యక్తంచేయటంతోనే చేరిక ఆగిపోయిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. కారణం ఏదైనా సరే ముద్రగడను పవన్ అవమానించారనే టాక్ కాపుల్లో బాగా పెరిగిపోతోంది. మరి దీనిపై ముద్రగడ మాత్రం ఇంతవరకు నోరిప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: