తెలంగాణ కీలక నిర్ణయం.. విద్యుత్‌ కొరత తీరినట్టే?

Chakravarthi Kalyan
జ‌లాశాయాల‌పై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. జ‌లాశాయాల‌పై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తిపై సాగునీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో క‌లిసి సింగరేణి సంస్థ ఉన్నతాధికారుల‌తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స‌మీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జలాశయాల్లో వెయ్యి మెగావాట్ల ఫ్లోటింగ్‌ సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల‌ని సింగరేణి అధికారులను ఆదేశించారు.

మ‌త్స్య సంప‌ద‌కు న‌ష్టం వాటిల్లకుండా ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి డీపీఆర్  లు సిద్ధం చేయాల‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. కాలుష్య ర‌హిత విద్యుత్తు ఉత్పత్తి కోసం ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తును ప్రోత్సహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఇరిగేషన్ శాఖ నుంచి అవసరమైన సహకారం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు సింగరేణి 300 మెగా వాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప‌నులు చేపట్టింది. అందులో ఇప్పటి వరకు 224 మెగా వాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోంది. మరో 76 మెగా వాట్ల ఉత్పత్తికి ప‌నులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయ‌ని సింగ‌రేణి సంస్థ సీఎండీ ఎన్‌. బ‌ల‌రాం మంత్రుల‌కు వివ‌రించారు. మల్లన్నసాగర్, లోయర్ మానేర్ డ్యాం  జ‌లాశాయాల‌పై ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప్రణాళికలను ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జేంటేష‌న్ ద్వారా అధికారులు వివ‌రించారు.

రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలను అధ్యయనం చేస్తున్నామ‌ని అధికారులు చెప్పారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కోసం జ‌లాశాయాల ఉప‌రిత‌లంపై 6శాతం మాత్రమే  వినియోగించ‌డం వల్ల మ‌త్స్య సంప‌ద‌కు ఎలాంటి న‌ష్టం ఉండ‌దని అధికారులు డిప్యూటీ సీఎం భట్టికి వివరించారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో విద్యుత్‌ కొరత తీరిపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: