రాజకీయాల్లోకి అజహరుద్దీన్ తనయుడు..?

Chakravarthi Kalyan
మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తనయుడు మహ్మద్ అసదుద్దీన్ ఇక నుంచి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొననున్నారా అంటే.. అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గతంలో యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు అజహరుద్దీన్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.

ఓ వైపు తండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే... మరోవైపు తన తనయుడు మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అసదుద్దీన్ ను కూడా కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తనవంతు సహాయం అందించడానికి రెడీ అవుతున్నారు. గ్రేటర్ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని యువ ఓటర్లను ఆకర్షించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు తమ కుమారులను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేలా చూస్తున్నారు.

సికిందరాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుడిని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు. అలాగే మైనంపల్లి హనుమంతరావు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి తన కుమారుడిని గెలిపించుకున్నారు. ఇలా చాలా మంది సీనియర్లు రాబోవు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి... క్రియాశీలకంగా మారుస్తున్నారు.

ఇప్పుడు అజహారుద్దీన్ కూడా తన తనయుడిని వీలైనంత వేగంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనే తలంపుతో ఉన్నట్లు ప్రచారం జరగుతోంది. అందుకే మొదట పార్టీలో క్రియాశీలకంగా సేవలందించాలని సికిందరాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంటు పరిధిలో చాలా విస్తృతంగా పర్యటించడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపునకు తనవంతు సహాయం తండ్రితోపాటు చేయడానికి యువ నాయకుడు మహ్మద్ అసదుద్దీన్ సిద్ధమవుతుండతంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, ఇటు అజహరుద్దీన్ అభిమానుల్లో ఆనందోత్సహాలు వెల్లివిరుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: