అప్పుడే జనసేన, టీడీపీ వర్గాల మధ్య దాడులు?

Chakravarthi Kalyan
సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. రా కదిలిరా పేరుతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నిర్వహిస్తున్న ఈ సభలు టీడీపీ, జనసేన మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలకు అద్దం పడుతున్నాయి. పలు అంశాలపై ఇరు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ఏకాభిప్రాయం కుదరడం లేదు.

అభ్యర్థుల ప్రకటన, సీట్ల పంపకాల వ్యవహారంలో చోటు చేసుకుంటున్న జాప్యం ఈ పరిణామాలకు దారి తీస్తోంది. గ్రామ స్థాయిలో కలిసి మెలసి పని చేయాల్సిన ఈ రెండు పార్టీల కార్యకర్తలు కొట్లాటకు దిగుతున్నారు. టీడీపీ-జనసేన మధ్య పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రత్యేకింది టీడీపీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం పట్ల జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య ఏర్పాటైన ఆత్మీయ సమావేశాల్లో నియోజకవర్గ స్థాయి నాయకులు గొడవ పడ్డారు.

ఇప్పుడు ఏకంగా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అలాంటి వాతావరణమే కనిపించింది. గంగాధర నెల్లూరు లో చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ, జనసేన నాయకులు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. జెండాలతో కట్టిన కర్రలను తీసుకుని మరీ టీడీపీ కార్యకర్తలు జనసేన సానుభూతిపరులను తరమి కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ గొడవకు కారణం ఏంటంటే.. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ కొందరు సీఎం.. సీఎం నినాదాలు చేశారు. అది భరించలేని టీడీపీ కార్యకర్తలు డిష్యూం డిష్యూంకి దిగారు. అయితే దీనికి సంబంధించిన వార్త కానీ.. వీడియో కానీ ఎల్లో మీడియాలో ఎక్కడా కనిపించదు. అధికార వైసీపీలో ఏదైనా కలహాలు జరిగితే మాత్రం దానిని ప్రముఖంగా చిత్రీకరిస్తోంది. ఈ సారి అవకాశం వైసీపీ అనుకూల మీడియాకు దొరికింది. ఈ వార్తను వారు అద్భుతంగా కవర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: