హైదరాబాద్ : విచారణకు భయపడుతున్నారా ?

Vijaya


ఢిల్లీ లిక్కర్  స్కామ్ లో ఈడీ విచారణకు కల్వకుంట్ల కవిత ఇంత భయపడుతున్నారా ? ఆమె మాటలేమో కోటలను దాటుతుంటాయి కాని వాస్తవానికి విచారణకు హాజరవ్వాలంటే చాలా భయపడుతున్నట్లే కనిపిస్తోంది. అందుకనే తనకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరుతు సుప్రింకోర్టులో కవిత పిటీషన్ వేశారు. ఈరోజు జరిగిన విచారణ 16వ తేదీకి వాయిదా పడింది. అందరి వాదనలు అదేరోజు వింటామని అదే రోజు విచారణను పూర్తిచేస్తామని కూడా సుప్రింకోర్టు ప్రకటించింది.



ఎన్నిసార్లు విచారణకు నోటీసులు ఇస్తున్నా కవిత హాజరుకావటంలేదని ఈడీ తరపున అడిషినల్ సొలిసిటర్ జనరల్ విచారణలో చెప్పారు. ఈడీ నోటీసులను సవాలు చేయటం వల్లే విచారణకు హాజరుకావటంలేదని పిటీషనర్ తరపు లాయర్ కపిల్ సిబల్ చెప్పారు. రెండువైపుల వాదనలు విన్న జడ్జి అభిషేక్ బెనర్జి, నళినీ చిదంబరం, కవిత కేసులన్నింటినీ కలిపి  అదేరోజు విచారిస్తామని జడ్జి ప్రకటించారు.



కవితను ఢిల్లీలోని ఆపీసులు మూడుసార్లు ఈడీ విచారించింది. అయితే ఆ తర్వాత నుండి విచారణకు హాజరుకావటంలేదు. ఏదో కారణం చెప్పి విచారణ నుండి కవిత తప్పించుకుంటునే ఉన్నారు. దీనికి కారణం ఏమిటంటే ఈడీ తనను ఎక్కడ అరెస్టుచేస్తుందో అన్న భయమని అర్ధమవుతోంది. అరెస్టు నుండి  తప్పించుకోవాలంటే సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే కేసు ఫైనల్ అయ్యేంతవరకు ఇక తనను ఈడీ ముట్టుకోదన్న ధైర్యంతోనే ఆమె కోర్టులో పిటీషన్ వేసినట్లు అర్ధమైపోతోంది.



లిక్కర్ స్కామ్ పాత్రలు, సూత్రదారులంటు ఇప్పటికే ఈడీ చాలామందిని అరెస్టు చేసింది. ఇందులో కొందరు అప్రూవర్లుగా కూడా మారిపోయారు. మరికొందరిని ఈడీ కవితకు బినామీలుగా అనుమానిస్తోంది, ఆరోపిస్తోంది. కోర్టులో ఫైల్ చేసిన చార్జిషీట్లు, రిమాండ్ రిపోర్టుల్లో చాలా చోట్ల కీలకసూత్రదారుగా కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. బీఆర్ఎస్-బీజేపీ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారమే కవితను ఈడీ అరెస్టుచేయటంలేదని కాంగ్రెస్  పదేపదే ఆరోపిస్తోంది. మొన్నటి తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పాయింట్ కూడా కాంగ్రెస్ ప్రచారంలో కీలకంగా మారిన విషయం తెలిసిందే. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: