అమరావతి : జగన్ సూటిగా చెప్పేశారా

Vijaya

దెందులూరులో జరిగిన సిద్ధం బహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి జనాలకు నేరుగానే చెప్పేశారు. ఇపుడు అందుతున్న పెన్షన్లు,  సంక్షేమపథకాలు కంటిన్యు అవ్వాలంటే వైసీపీకి మాత్రమే ఓట్లేయాలని జగన్ డైరెక్టుగానే చెప్పారు. పథకాలు వద్దని అనుకుంటే ప్రతిపక్షాలకు ఓట్లేయాలని చెప్పారు. పధకాలు కావాలో వద్దో తేల్చుకోవాల్సింది జనాలే అని జగన్ చాలా స్పష్టంగా తేల్చిచెప్పారు. ఐదేళ్ళల్లో జనాల కోసం తాను 124 సార్లు బటన్లు నొక్కిన విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో తనకోసం బటన్లను రెండుసార్లు నొక్కలేరా అని జనాలను అడిగారు.



ప్రతి సంక్షేమపథకానికి బటన్ నొక్కి డబ్బులను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతినెలా ఒకటవ తేదీన పెన్షన్ డబ్బులను ఇంటింటికి తెచ్చి అందించిన విషయాన్ని జనాలు గుర్తుంచుకోవాలన్నారు. జనాలు తనకు తోడున్నారన్న ధైర్యంతోనే ప్రతిపక్షాలతో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. తాను ఒంటరిని అయిపోయినట్లు ఎప్పుడూ అనుకోలేదని ఎందుకంటే మీరంతా తోడున్నపుడు తాను ఒంటరిని ఎలాగవుతానని జనాలనే అడిగారు. జనాలు ఏమారి ప్రతిపక్షాలకు ఓట్లేస్తే టీడీపీ చంద్రముఖిలాగ మారి ఇంటింటికి వచ్చి పీడిస్తుందన్నారు.



కౌరవసేన లాంటి ప్రతిపక్షాలతో యుధ్ధంచేయటానికి తనతో పాటు రావాలని ప్రజలను జగన్ కోరారు. సంక్షేమపథకాలే తన పాశుపతాస్త్రంగా జగన్ చెప్పుకున్నారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే ఇపుడు అమలవుతున్న సంక్షేమపథకాలేవీ ఉండవని కూడా చెప్పారు. పథకాల్లో లబ్దిదారులే  తనకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారని జగన్ చెప్పారు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని జగన్ డైరెక్టుగా దెందులూరు బహిరంగసభలో జనాలకు చెప్పేశారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది జనాలే. తమకు సంక్షేమపథకాలు కావాలని అనుకుంటే వైసీపీకి ఓట్లేస్తారు.  ప్రతిపక్షాలకు ఓట్లేశారంటేనే తమకు సంక్షేమపధకాలు వద్దని జనాలు డిసైడ్ చేసుకున్నట్లుగా అనుకోవాలి.



సంక్షేమపథకాలను చూపించి జగన్ జనాలను బెదిరిస్తున్నాడని ఎల్లోమీడియా గోలమొదలుపెట్టింది. ప్రతిపక్షాలకు ఓట్లేస్తే పథకాలు రద్దవుతాయని జగన్ బెదిరించటంలో అర్ధంలేదని ఎల్లోమీడియా ఏడుపు మొదలుపెట్టింది. 2014 ఎన్నికల్లో  సంక్షేమపథకాలను ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అమలుచేశారో అందరూ చూసిందే. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ ఎన్ని నెరవేర్చారో జనాలు చూస్తున్నారు. కాబట్టే ఎవరి పాలన కావాలో తేల్చుకోవాలని జగన్ చెప్పారు. ఇందులో జనాలను బెదిరించటం ఏముందో అర్ధంకావటంలేదు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: