అమరావతి : ఇద్దరిపైనా ఒత్తిడి పెరిగిపోతోందా ?

Vijaya

ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ పైన ఒత్తిడి పెరిగిపోతున్నట్లుంది. రెండుపార్టీల్లోను పోటీచేయాలని ప్రయత్నిస్తున్న ఆశావహుల నుండి టికెట్ల కోసం ఇద్దరు అధినేతలపైనా రోజురోజుకు ఒత్తిడి పెరిగిపోతోంది. దానికితోడు చంద్రబాబు, పవన్ ఇగోకి వెళ్ళి ఎవరికివారుగా టికెట్లను ప్రకటించేయటంతో మరింత గందరగోళం పెరిగిపోతోంది. మండపేటలో జోగేశ్వరరావు, అరకులో సివేరి సోము పోటీచేస్తారని చంద్రబాబు ప్రకటించటంతో గందరగోళం  మొదలైంది.



పొత్తులో ఉన్నా ఏకపక్షంగా చంద్రబాబు టికెట్లు ప్రకటిస్తున్నారంటు జనసేన నేతలు పవన్ పైన మండిపడ్డారు. పొత్తు ధర్మం పాటించని చంద్రబాబుతో ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదని పవన్ పైన నేతలు మండిపోయారు. దాంతో పార్టీ మీటింగులో పవన్ కూడా రాజోలు, రాజానగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు. పవన్ చేసిన ప్రకటనతో టీడీపీలో గందరగోళం పెరిగిపోయింది. పై రెండు నియోజకవర్గాల్లో టీడీపీ తరపున పోటీచేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్న గొల్లపల్లి సూర్యారావు, బొడ్డు వెంకటరమణ చౌదరి పార్టీ ఆఫీసుకు వచ్చి నానా రచ్చచేశారు.



రెండుపార్టీల్లో గొడవలు జరుగుతుండగానే చంద్రబాబు నూజివీడులో కొలుసు పార్ధసారధిని అభ్యర్ధిగా ప్రకటించారు. అలాగే ప్రొద్దుటూరులో ఉక్కు ప్రవీణ్ కుమార్ తనకు తానే టికెట్ ప్రకటించేసుకున్నారు. ప్రకటించేసుకోవటమే కాకుండా వాల్ పోస్టర్లు ప్రింట్ చేసి ప్రొద్దుటూరు పట్టణమంతా అంటించేసి ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. దాంతో ఈ విషయమై రెండుపార్టీల్లోను గందరగోళం బాగా పెరిగిపోతోంది. రెండుపార్టీల వ్యవహారం చూస్తుంటే పొత్తు సక్రమంగా సాగే లక్షణం కనిపించటంలేదు.



ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులను ఫైనల్ చేసి ప్రకటించేస్తున్నారు. ఎక్కడన్నా మార్పులు చేర్పులు చేయాల్సొస్తే చేస్తున్నారు. అలిగిన, ఆగ్రహంతో ఉన్న ఎంఎల్ఏలను జగన్ అసలు పట్టించుకోవటమే లేదు. దాంతో పార్టీలో ఉండి లాభంలేదని అర్ధమైపోయిన ఎంఎల్ఏల్లో కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. దాంతో వైసీపీలో నుండి వచ్చిన వాళ్ళతో టీడీపీ, జనసేనలో గొడవలు మొదలవుతున్నాయి. మొత్తానికి వివిధ కారణాలతో రెండుపార్టీల అధినేతలపైన బాగా ఒత్తిడి పెరిగిపోతున్నట్లే ఉంది. మరి ఈ సమస్యలనుండి వీళ్ళు ఎప్పుడు బయటపడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: