గోదావరి : చంద్రబాబు, పవన్ కు షాకిచ్చారా ?

Vijaya

మాజీమంత్రి, కాపు సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య ఒకేసారి ఇటు చంద్రబాబునాయుడు అటు పవన్ కల్యాణ్ ఇద్దరికీ పెద్ద షాకిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 50 నియోజకవర్గాల్లో పోటీచేయాల్సిందే అని చెప్పి టీడీపీకి  చేగొండి షాకిచ్చారు. అదే సమయంలో టీడీపీ విదిల్చే ఏ 25 లేదా 30 సీట్లకు పవన్ తృప్తిపడితే టీడీపీ-జనసేన పొత్తు విఫలప్రయోగమవుతుందని కుండబద్దలు కొట్టేశారు. చంద్రబాబు ఇచ్చే  సీట్ల విషయంలో పవన్ సమాధానపడితే కాపుల ఓట్లు రెండుపార్టీలకు పడవు అన్న అర్ధమొచ్చేట్లుగా హెచ్చరించారు.



చేగొండి తన లేఖలో కాపుల మనోభావాలు, అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నట్లుగా చెప్పారు. అంటే గౌరవప్రదమైన సీట్లను పవన్ సాధించకపోతే కాపులు జనసేనకు ఓట్లేసేది అనుమానమే అని పవన్ కు కూడా వార్నింగిచ్చారు. ఇదే సమయంలో జనసేనకు 50 సీట్లు తక్కువ కాకుండా ఇవ్వాల్సిందే అని చెప్పటం ద్వారా టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. జనసేన పోటీచేస్తుందని రెండు రోజుల క్రితం పవన్ రాజోలు, రాజానగరం సీట్లను  ప్రకటించటాన్ని చేగొండి తప్పుపట్టారు. పవన్ ప్రకటించిన రెండు స్ధానాలతో కాపులు సంతృప్తిచెందలేదన్నారు.



పై రెండు స్ధానాలు కాకుండా రాజకీయంగా, సామాజికపరంగా, ఆర్ధికంగా కాపులు ఎంతో బలంగా ఉన్న ఉండి, ఉంగుటూరు, తణుకు, నిడదవోలు నియోజకవర్గాలను పవన్ ప్రకటించుంటే పవన్లోని నిబద్ధత తెలిసేదన్నారు. అంటే  పవన్ రాజోలు, రాజానగరం నియోజకవర్గాలను ప్రకటించటంలో నిబద్ధత లేదని కాపులను హెచ్చరించారు. తక్కువ సీట్లు తీసుకుంటే జనసేన నేతలు, కాపులు, పవన్ మద్దతుదారులు ఏమాత్రం తృప్తిపడరని చేగొండి స్పష్టంగా ప్రకటించారు.



గౌరవప్రదమైన సీట్లను పవన్ సాధించలేకపోతే రెండుపార్టీల మధ్య పొత్తు ఫలితం ఇవ్వదు, ఓట్ల బదిలీ జరగదని కూడా తేల్చేశారు. ఇలాంటి పొత్తులు జగన్మోహన్ రెడ్డికే లాభిస్తుందన్నట్లుగా మాజీమంత్రి చెప్పేశారు.  సీట్లకోసం పవన్ యాచించేస్ధాయిని జనసైనికులు, కాపులు కోరుకోవటంలేదన్నారు. పొత్తు ధర్మాన్ని చంద్రబాబు పాటించి జనసేనకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోతే రెండుపార్టీలు నష్టపోవటం ఖాయమని జోగయ్య జోస్యం కూడా చెప్పారు. తన లేఖలో కాపులను రెచ్చగొడుతు, పవన్, చంద్రబాబును హెచ్చరిస్తూనే పెద్ద షాకిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: