అమరావతి : జగన్ కు పెద్ద నష్టమేనా ?

Vijaya

జగన్మోహన్ రెడ్డి పార్టీకి పెద్ద నష్టం జరిగింది. ఎలాగంటే నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. కొంతకాలంగా లావుకు జగన్ కు మధ్య చిన్నపాటి వివాదం నడుస్తోంది. అదేమిటంటే  రాబోయే ఎన్నికల్లో లావును నరసరావుపేటలో కాకుండా గుంటూరు ఎంపీగా పోటీచేయాలని జగన్ చెప్పారు. అయితే అందుకు ఎంపీ అంగీకరించలేదు. తాను గుంటూరు ఎంపీగా పోటీచేయనని, నరసరావుపేట ఎంపీగానే పోటీచేస్తానని గట్టిగానే చెప్పారు.



అయితే కొంతకాలం ఇద్దరి మధ్య డిస్కషన్లు జరిగిన తర్వాత మధ్యవర్తులు కూడా చర్చలు జరిపి ఇద్దరిలో ఎవరినీ ఒప్పించలేకపోయారు. దాంతో వేరేదారిలేక లావు ఈరోజు ఎంపీ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. అంటే వివాదం మొదలై ఇన్నిరోజులు అయినా ఇటు జగన్  అటు లావు ఇద్దరు కూడా తమ పట్టుదలను వీడలేదని అర్ధమవుతోంది. పోయిన ఎన్నికల్లోనే లావు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన లావు ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. ఆర్ధికబలంతో పాటు అంగబలం కూడా పుష్కలంగా ఉంది.



ఒకవిధంగా లావును వదులుకోవటం వైసీపీకి పెద్ద నష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఎంపీగా లావు బాగానే వ్యవహరించారు. నియోజకవర్గంలో ఎక్కడా వివాదాలు కూడా లేవు. చిలకలూరిపేట ఎంఎల్ఏ, మంత్రి విడదల రజనితో మాత్రమే లావుకు ప్రోటోకాల్ వివాదం ఉండేది.



ఆ వివాదాన్ని కూడా జగన్ సర్దుబాటు చేయటంతో  ఇపుడు ప్రశాంతంగానే ఉన్నారు. పైగా రజనీని జగన్ చిలకలూరిపేట నుండి గుంటూరుకు మార్చేశారు. అయితే నియోజకవర్గం మార్పు కారణంగా లావుతో జగన్ కు చిన్న వివాదం మొదలై ముదిరిపోయింది. దాంతో చివరకు లావు పార్టీని వదిలేశారు. లావుకు సౌమ్యుడిగా పేరుంది. విడదల రజనీతో తప్ప ఇంకెవరితోను చెప్పుకోదగ్గ వివాదం లేదు. అలాంటి లావును జగన్ దూరం చేసుకున్నారని పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. అసలు నరసరావుపేట నుండి గుంటూరుకు ఎందుకు మార్చారో కూడా తెలీటంలేదు. సామాజికివర్గాలను బ్యాలెన్స్ చేయటం కోసమే నరసరావుపేట సీటులో బీసీని పోటీచేయించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే బీసీ అభ్యర్ధి ఎవరో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: