హైదరాబాద్ : రేవంత్ ఎక్కువగా మాట్లాడుతున్నారా ?

Vijaya

మాజీ ముఖ్యమంత్రి కేసీయార్ గురించి రేవంత్ రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నారా ? జనాలకు అలాగే అనిపిస్తున్నట్లుంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేసీయార్ గురించి రేవంత్ మాట్లాడని రోజులేదు. ప్రతిరోజు ఏదో ఒక అంశంపై కేసీయార్ తో పాటు కేటీయార్, హరీష్ రావును టార్గెట్ చేస్తునే ఉన్నారు. రాజకీయంగా ఎవరిపైన ఎవరైనా మాట్లాడచ్చు కాని మాట్లాడేటపుడు కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటంది.



లండన్ పర్యటనలో రేవంత్ మాట్లాడుతు పులి బయటకు వస్తే బోనులో బందిస్తామని చెప్పారు. ఈ మాటలు విన్నతర్వాత కేసీయార్ ను రేవంత్ బెదిరిస్తున్నట్లుగానే ఉంది. కేసీయార్ విరిగిన తుంటిఎముకకు ఆపరేషన్ చేసుకుని విశ్రాంతిలో ఉన్నారు. ఫిజికల్ గా ఫిట్ అవగానే తొందరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెడతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యం ఆధారంగా లండన్లో ఎవరో రేవంత్ ను ఏమడిగారో తెలీదు. రేవంత్ బదులిస్తు పులి బయటకు వస్తే బోనులో పెడతామని అనటంలో అర్ధంలేదు.



రేవంత్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏమి మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందని అనుకుంటున్నారేమో. ఎన్నికలకు ముందు తన పరిస్ధితి ఏమిటో గుర్తుంచుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఏమవుతుందో ఎవరు చెప్పలేరు. ముఖ్యమంత్రిగా రేవంత్ ఎన్నిరోజులుంటారో కూడా ఎవరూ చెప్పలేరు. అధికారంలో ఉన్నపుడు కేసీయార్ కూడా ఆకాశమేహద్దుగా చెలరేగి మాట్లాడేవారు. ఇపుడేమైంది ? ఎన్నికల్లో ఓడిన దగ్గర నుండి మాటకూడా మాట్లాడలేకపోతున్నారు.



వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ పరిస్ధితి మరీ దయనీయంగా తయారైంది. అధికారంలో ఉన్నపుడు నోటికేదొస్తే అది మాట్లాడేవారు. ఇపుడు పార్టీ ఓటమిపై నేతలు, క్యాడరే కేటీయార్ ను పట్టుకుని దుమ్ముదులిపేస్తున్నారు. రాజకీయాల్లో పరిస్ధితులు తల్లకిందులవటానికి ఎక్కువసేపు పట్టదు. కాబట్టి కేసీయార్ అండ్ కో పై రేవంత్ మాటలు తగ్గించేస్తే బాగుంటుంది. కాళేశ్వరం దోపిడి, ధరణి పోర్టల్ అవకతవకలపై విచారణకు రెడీ అవుతున్నారు. టెక్నికల్ గా ఇలాంటి విషయాలపై దూకుడు చూపిస్తే ఎవరూ తప్పుపట్టరు. కేసీయార్ అండ్ కో ను ఫిక్స్ చేయదలచుకుంటే టెక్నికల్ గా చేయాలి కాని నోరుపారేసుకుంటే నష్టమే తప్ప లాభముండదు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: