అమరావతి : జగన్ సూపర్ ప్లాన్ను తట్టుకోగలరా ?
ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరో సూపర్ ప్లాన్ సిద్ధంచేసినట్లు అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీసీల ఓట్లను ఆకర్షించటంలో భాగంగానే గట్టి ప్లాన్ వేసినట్లు అర్ధమవుతోంది. అదేమిటంటే ఓసీ నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు ఇవ్వటం. బీసీలంటే మొదటినుండి జగన్ పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. పోయిన ఎన్నికల్లోనే సంప్రదాయంగా ఓసీలు పోటీచేస్తున్న కొన్ని ఎంపీ నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లిచ్చారు.
అనంతపురం, హిందుపురం, కర్నూలు, రాజమండ్రి లాంటి నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లిచ్చారు. జగన్ ప్రయోగం సక్సెస్ అయి అన్నీ నియోజకవర్గాల్లోను వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. ఇపుడు అదే ప్రయోగాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అమలుచేయబోతున్నారు. ఇందులో భాగంగానే మంగళగిరి, కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాలను బీసీ నేతలకు కేటాయించారు. మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కదిరిలో సిద్ధారెడ్డి, ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
సిట్టింగ్ ఎంఎల్ఏలకు బదులు మంగళగిరిలో గంజి చిరంజీవి, కదరిలో బీఎస్ మక్బూల్ అహ్మద్, ఎమ్మిగనూరులో మాచారి వెంకటేష్ కు టికెట్ ఖాయంచేశారు. అంటే ముగ్గురు రెడ్డి ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను జగన్ మరో ముగ్గురు బీసీ నేతలకు కేటాయించిన విషయం స్పష్టమవుతోంది. ముందుముందు ఇంకెన్ని ఓసీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించబోతున్నారో తెలీదు. జగన్ తాజా వ్యూహాలను ప్రతిపక్షాలు కానీ ఎల్లోమీడియా కాని ఏమాత్రం ఊహించలేదు.
జగన్ వ్యూహాలకు ముందు బిత్తరపోయిన ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తేరుకోలేక వైసీపీలో చిచ్చుపెట్టే పనిని మొదలుపెట్టాయి. టికెట్లు దక్కని వాళ్ళని జగన్ పైకి రెచ్చగొట్టే పని మొదలుపెట్టాయి. ఎంతమందిని వీలుంటే అంతమందిని రెచ్చగొట్టి వైసీపీలో గందరగోళం సృష్టించే ప్రణాళికలను అమలుచేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీసీలు వైసీపీకి ఎక్కడ మద్దతుగా నిలబడతారో, మళ్ళీ వైసీపీనే ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తుందో అన్న భయం ప్రతిపక్షాలు, ఎల్లోమీడియాలో స్పష్టంగా తెలుస్తోంది. టికెట్లు మొత్తం ఫైనల్ అయ్యేటప్పటికి ఇంకెంతమంది బీసీలను జనరల్ సీట్లలో పోటీచేయిస్తారో చూడాలి.