అమరావతి : సుప్రింకోర్టు చంద్రబాబు నోరు కట్టేసిందా ?

Vijaya


చంద్రబాబునాయుడుకు సుప్రింకోర్టు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని చాలెంజ్ చేస్తు సీఐడీ సుప్రింకోర్టులో పిటీషన్ వేసింది. ఆ పిటీషన్ పైనే మంగళవారం విచారణ జరిగింది. కేసును వాయిదా వేసిన సుప్రింకోర్టు చంద్రబాబుకు ఒక షరతు విధించింది. అదేమిటంటే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన విషయాలు బహిరంగంగా గాని మీడియాతో కాని ఎక్కడా మాట్లాడకూడదని. ఇదే కేసులో బెయిల్ ఇచ్చినపుడు హైకోర్టు ఎలాంటి షరతులు విధించలేదు. అయితే సుప్రింకోర్టు మాత్రం  షరతు విధించటం చంద్రబాబుకు షాకనే చెప్పాలి.



ఎలాగంటే తొందరలోనే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అలాగే డిసెంబర్లోనే బహిరంగసభలు ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో అంటే కోస్తాంధ్రా, ఉభయగోదావరి, రాయలసీమ ప్రాంతాల్లో మూడు బహిరంగసభలు నిర్వహించే విషయమై తమ్ముళ్ళతో మాట్లాడుతున్నారు. బహిరంగసభల సందర్భంగా తనను ప్రభుత్వం కేసులో ఎలా ఇరికించిందనే విషయాన్నే హైలైట్ చేయాలని అనుకున్నారు. ప్రభుత్వం తనపైన తప్పుడు కేసు నమోదుచేసి అన్యాయంగా జైలుకు పంపిందని చెప్పి జనాల సింపతికి ప్రయత్నించాలన్నది చంద్రబాబు వ్యూహం.



బహిరంగసభల్లో తన బెయిల్ మంజూరు సందర్భంగా జడ్జి టి మల్లికార్జునరావు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించాలని కూడా అనుకున్నారు. ఇప్పటికే జడ్జి వ్యాఖ్యలను లోకేష్ తన పాదయాత్రలో చెబుతున్న విషయం తెలిసిందే. తనపై పెట్టింది తప్పుడు కేసని తాను చెబుతున్న విషయాన్ని జడ్జి కూడా కన్ఫర్మ్ చేసినట్లు చంద్రబాబు చెప్పాలని అనుకుంటున్నారు. అయితే సుప్రింకోర్టు తాజా షరతుతో ఆ అవకాశాన్ని చంద్రబాబు కోల్పోయారు.



ఎక్కడ ఏమి మాట్లాడినా స్కిల్ స్కామ్ కు సంబంధించిన విషయాలను మాత్రం మాట్లాడద్దని సుప్రింకోర్టు గట్టిగా చెప్పింది. దాంతో బహిరంగసభలు నిర్వహించినా, ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొన్నా ఇక చంద్రబాబు మాట్లాడేది ఏముంటుంది ? ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని తిట్టింది అరిగిపోయిన రికార్డులాగ మళ్ళీ తిట్టాల్సుంటుందంతే. పైగా 17ఏ పైన చంద్రబాబు వేసిన క్వాష్ పిటీషన్ తీర్పు తర్వాతే బెయిల్ పిటీషన్ను పరిశీలిస్తామని చెప్పింది. 17ఏ క్వాష్ పిటీషన్ పై తీర్పు ఎప్పుడుంటుందో, బెయిల్ పిటీషన్ను ఎప్పుడు పరిశీలిస్తుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: