విమానాలు నడపలేకపోతున్న పాకిస్తాన్?
పాకిస్థాన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.350, కేజీ బియ్యం రూ.100 నిత్యావసర సరకుల ధరలన్నీ ఆకాశన్నంటుతున్నాయి. అక్కడ ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు కూడా తరిగిపోయాయి. అక్కడి పౌరులు జీవించడమే గగనమయ్యే పరిస్థితులు ఎదురవుతున్నాయి. చిన్న చిన్న వస్తువలు దగ్గర నుంచి ఇంధనాల వరకు అన్నీ ధరలు ప్రియమయ్యాయి.
తాజాగా పాకిస్థాన్ లో ఆయిల్, గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో అక్కడి ఇంటర్నేషనల్ విమాన సంస్థ తమ ఫ్లైట్లను రద్దు చేసింది. విమానాలు నడపాలంటే ఇంధనం అవసరం కదా. మరి ఆ చమురే ఇప్పుడు అక్కడ బంగారమైంది. దీంతో పాక్ ఎయిర్ లైన్స్ అన్ని విమానాలను పక్కన పెట్టేసింది. సరిపడనంత ఇంధన సరఫరా లేకపోవడంతో విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ లైన్స్ ప్రతినిధులు తెలిపారు. 13 డొమెస్టిక్, 11 ఇంటర్ నేషనల్ ఫ్లైట్లు రద్దు చేశారు. మిగతా వాటిని రీ షెడ్యూల్ చేశారు.
పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ కు అక్కడి ప్రభుత్వమే ఇంధన సరఫరా చేస్తోంది. అయితే ఎయిర్ లైన్స్ నష్టాల్లో ఉండటంతో దీనికి చాలా రోజుల నుంచి డబ్బులు కట్టడం లేదు. దీంతో పాక్ స్టేట్ ఆయిల్ సరఫరాను నిలిపివేసింది. అప్పుల ఊబిలో ఉన్న ఎయిర్ లైన్స్ ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ సాయం కూడా అందడం లేదు. ఆ సంస్థ నష్టాల నుంచి బయట పడాలంటే కనీసం 100 మిలియన్లు అవసరం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఎయిర్ లైన్స్ తల పట్టుకుంది.