అమరావతి : జగన్ పై ఉద్యోగులు మండిపోతున్నారా ?
వచ్చేఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ సీట్లు రావాలని జగన్మోహన్ రెడ్డి చెప్పటం, వచ్చేఎన్నికల్లో మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని మంత్రులు పదేపదే చెప్పటం అందరు చూస్తున్నదే. అయితే వీళ్ళకు అర్ధంకానిదేమంటే ఉద్యోగుల్లో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులాగ పెరిగిపోతోంది. ఉద్యోగుల్లో అత్యధికులు అనేక కారణాలతో ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆగ్రహానికి కారణం ఏమిటంటే ప్రతినెలా 1వ తేదీన జీతాలు రావటంలేదని. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు 1వ తేదీన పెన్షన్ పడటంలేదని. ఈమధ్య గవర్నర్ ను తాజాగా చీఫ్ సెక్రటరీని కూడా ఇదే విషయమై కలిశారు.
కొందరు ఉద్యోగ సంఘాల నేతలతోను, ట్రెజరీ ఉద్యోగులతోను మాట్లాడిన తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లంతా తీవ్రస్ధాయిలో మండిపోతున్నారని. దశాబ్దాలుగా ప్రతినెలా 1వ తేదీన జీతం తీసుకోవటం అలవాటైపోయిన జీవులకు జీతాలు, పెన్షన్లు ఆలస్యమవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని శాఖల్లో ఉద్యోగులకు 2వ తేదీన జీతాలు పడుతుంటే మరికొన్ని శాఖల్లోని ఉద్యోగులకు 2 వారంలో కానీ జీతాలు పడటంలేదు.
పెన్షనర్ల వ్యవహారం కూడా దాదాపు ఇలాగే ఉండటంతో వాళ్ళు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తమకు అందాల్సిన డీఏ బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్ మెంటు విషయం కన్నా జీతాలు, పెన్షన్ల గురించే పట్టుదలగా ఉన్నారట. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు పడే విషయంలోనే చాలా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తిరుపతి సబ్ ట్రెజరీలోని ఉద్యోగులతో మాట్లాడినపుడు పై విషయాలు తెలిశాయి. తిరుపతి సబ్ ట్రెజరీ పరిధిలో 9 వేల మంది ఉద్యోగులు, 7 వేల మంది పెన్షనర్లున్నారు.
సబ్ ట్రెజరీ ఉద్యోగులు మాట్లాడుతు ఏ పార్టీ అధికారంలో ఉన్నా జీతాలు, పెన్షన్లు మాత్రం ప్రతినెలలా 1వ తేదీన పడేవని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో కూడా జీతాలు ఫస్ట్ తేదీకల్లా అందేవన్నారు. జగన్మోహన్ రెడ్డి గనుక జీతాలు, పెన్షన్లు 1వ తేదీన ఇచ్చేట్లుగా ప్లాన్ చేసుకోకపోతే ఉద్యోగులు, పెన్షనర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లేయటం ఖాయమన్నారు. ఎన్నిసమస్యలుగా జీతాలు, పెన్షన్లకు నిధులు కేటాయించి 1వ తేదీనే జమయ్యేట్లు చూసుకోవాల్సిన బాధ్యత సీఎంపైనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది ఉద్యోగులు, 4 లక్షల మంది పెన్షనర్లున్నట్లు సమాచారం.