అమరావతి : పవన్ ఇంతలా ఫీలైపోతున్నారా ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిపోయినట్లే ఫీలవుతున్నారా ? లేకపోతే ఎన్నికలు ఎప్పుడు జరిగినా సీఎంగా బాధ్యతలు తీసుకోవటం మాత్రమే మిగిలుందని అనుకుంటున్నారా ? మొన్నటి రణస్ధలం సభలో కమెడియన్ హైపర్ ఆది మాట్లాడుతు వచ్చేఎన్నికల తర్వాత పవన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయటాన్ని చూడబోతున్నాము అని చెప్పిన మాటలు పవన్ పైన బాగా పనిచేస్తున్నట్లుంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మాట్లాడిన మాటలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.



ఇంతకీ విషయం ఏమిటంటే జనసేన అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ లోని లోపాలను సవరిస్తుందని హామీ ఇచ్చారు. సబ్ ప్లాన్ కు నిధుల కేటాయించి ఆ నిధులను ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి మాత్రమే ఖర్చుచేస్తామని ప్రకటించారు. సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్ళించే ప్రసక్తే లేదన్నారు. సబ్ ప్లాన్ నిదుల అమలు పర్యవేక్షణకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఇపుడు నిలిచిపోయిన ప్రతిపథకాన్ని  పునరుద్ధరించబోతున్నట్లు చెప్పారు.



ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి నిలిచిపోయిన పథకాలన్నింటినీ పారదర్శకంగా అమలుచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పవన్ ఇంకా చాలా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనలో ఎస్సీ, ఎస్టీలందరు అణచివేతకు గురవుతున్నట్లు మండిపోయారు. ప్రభుత్వాన్ని నిలదీయటం కోసం తిరగబడాలని పిలుపిచ్చారు. తమ హక్కుల కోసం అణిచివేతకు గురవుతున్న వర్గాలు తిరగబడనంత వరకు వైసీపీ ప్రభుత్వం అణిచివేస్తునే ఉంటుందన్నారు.



పవన్ మాటలు, హామీలు చూస్తుంటే ఎన్నికలు పెట్టడమే ఆలస్యం ప్రమాణస్వీకారం చేయటం ఒకటే మిగిలిందన్నట్లుగా ఉంది. గతంలో కూడా కొన్ని హామీలనిచ్చేశారు. అప్పట్లో కూడా అధికారంలోకి వస్తే అమలుచేస్తామని కాకుండా అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. ఆలూలేదు చూలూలేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లుగా రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తారా ? లేకపోతే టీడీపీతో పొత్తుతో వెళతారా అన్న విషయాన్ని కూడా ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. బీజేపీతో పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే చెప్పినవన్నీ చెప్పినట్లు చేసి చూపిస్తామని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇపుడు కూడా బీజేపీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటుచేస్తే అని చెప్పిన వ్యక్తి సీఎం అయిపోయినట్లు బిల్డప్పులు ఇస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: