హైదరాబాద్ : హంగ్ అసెంబ్లీ తప్పదా ?

Vijaya





రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో హంగ్ అసెంబ్లీ తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మూడు ప్రధానపార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు దేనికదే అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పుకుంటున్నాయి. అయితే మూడుపార్టీలకూ అంత సీన్ లేదని గ్రండ్ రిపోర్టు బట్టి అర్ధమవుతోంది. ఎందుకంటే మూడుపార్టీల్లోను మైనస్ పాయింట్లు ఎక్కువగానే ఉన్నాయి. జనాల నాడిని తెలుసుకోవటానికి ప్రయత్నించినపుడు మూడుపార్టీల మీద అయిష్టత బయటపడింది.



పార్టీల నేతలతో పాటు జనాలతో మాట్లాడిన తర్వాత అర్ధమైందేమంటే అధికారంలోకి రావటానికి బీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటి రావటం కష్టమని. 119 నియోజకవర్గాల అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 60 సీట్ల మ్యాజిక్ మార్కు దాటాల్సిందే. కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతోంది. కాబట్టి సంపూర్ణ మెజారిటి దక్కేది అనుమానంగానే ఉంది. కేసీయార్ పాలనపైన జనాల్లో వ్యతిరేకత ఒక ఎత్తయితే మంత్రులు, ఎంఎల్ఏల మీద కూడా బాగా వ్యతిరేకత కనబడుతోంది.



ఇక కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే నేతల మధ్య కుమ్ములాటలు పెరిగిపోతు జనాలకు దూరమైపోతోంది. ఎనిమిదన్నరేళ్ళుగా ప్రతిపక్షంలోనే కూర్చున్నామన్న కనీస స్పృహ కూడా కాంగ్రెస్ నేతల్లో కనబడటంలేదు. ఎంతసేపు వ్యక్తిగత ఆధిపత్యం కోపం పాకులాడుతు పార్టీ పరువును రోడ్డున పడేస్తున్నారు. కాంగ్రెస్ నేతల్లో ఐకమత్యం ఆశించటమంటే ఎండమావుల్లో నీటిని ఆశించటమే. అందుకనే పార్టీపైన అభిమానం ఉన్న జనాల్లో  కూడా కాంగ్రెస్ పార్టీ అంటే వ్యతిరేకత పెరిగిపోతోంది.



ఇక బీజేపీ విషయం చూస్తే ఎంతసేపు నరుకుతాం, కేసీయార్ కుటుంబాన్ని జైల్లో పెడతాం, భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజల పేరుతో గోల చేయటంతోనే సరిపోతోంది. పట్టుమని 30 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులు లేని ఈ పార్టీ వచ్చేఎన్నికల్లో అధికారం తమదే అంటు గోలగోల చేసేస్తోంది. ఎంతసేపు మతపరమైన ప్రకటనలు, సెంటిమెంటును రెచ్చగొట్టి జనాలను ఆకర్షించాలన్న యావే తప్ప అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి చూపించటంలేదు. అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ పుంజుకుంటే ఆ మేరకు బీఆర్ఎస్ సీట్లు తగ్గిపోవటం ఖాయం. ఈ కారణాలతోనే  హంగ్ అసెంబ్లీ తప్పదనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: