అమరావతి : పవన్ రూటులోనే లోకేష్ వెళుతున్నారా ?
ఇంకా రెండుపార్టీలు పొత్తు పెట్టుకోనేలేదు అప్పుడు చినబాబు నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూటులో బయలుదేరేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏదో సినిమాల నేపధ్యంలో ఎవరో ఒక ట్వీటు పెట్టారు. అందులో అగ్రకులాలు, వెనకబడిన కులాల హీరోలంటు విభజన చూపించారు. దీనిపై ట్విట్టర్లోనే స్పందించిన లోకేష్ కులం, మతంపేరు చెప్పి రాజకీయం చేసేవారిని చెప్పుతో కొట్టండని పిలుపిచ్చారు.
మొన్ననే అంటే ఓ పదిరోజుల క్రిందటే విజయవాడ మీడియా సమావేశంలో పవన్ చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనను ప్యాకేజీ స్టార్ అని పిలిచేవాళ్ళని చెప్పుతో కొడతానని ఊగిపోతు పవన్ వార్నింగ్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. మైకులో మాట్లాడుతు అదికూడా చెప్పును చూపిస్తు పవన్ వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. తనను ఎవరైనా ప్యాకేజీస్టార్ అంటే ఇళ్ళల్లో నుండి లాక్కొచ్చి కొడతా నా కొడకల్లారా అంటు పూనకంతో ఊగిపోయారు.
అప్పటి పవన్ పూనకాన్నే జనాలు ఇంకా మరచిపోలేకుండా ఉన్నారు. పవన్ వర్నింగుకు రియాక్షన్ గా తాము రెండుచెప్పులతో కొట్టగలమంటు మంత్రులు, వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడ్డారు. ఇంకా ఆ చెప్పుల గోల తగ్గనేలేదు. ఇంతలో చినబాబు కూడా చెప్పుతో కొట్టమని ట్విట్టర్లో పిలుపివ్వటం ఆశ్చర్యంగానే ఉంది. లోకేష్ ను మంత్రులు, వైసీపీ నేతలు ఏ పేరుతో పిలుస్తారో అందరికీ తెలుసు.
దాని ఆధారంగా ఇకనుండి తనను ఎవరైనా పప్పు అని పిలిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇస్తారేమో. అసలు చెప్పుల గోలేమిటో అర్ధంకాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ రాజీకీయాలు అన్నీ హద్దులు దాటేసి బూతులతో నిండిపోతోంది. ఒకనేత ఒకమాటంటే మరోపార్టీ నేత నాలుగంటున్నారు. దీంతో పోటీలుపడి మరీ బూతులు మాట్లాడేస్తున్నారు. ఈ విషయంలో ఒకపార్టీ అనికాదు అన్నీ పార్టీలదీ తప్పులు చేస్తున్నాయి. ఈ బూతుల గోల, చెప్పుల గోల ఎప్పటికి వదులుతుందో ఏమో.