అమరావతి : అప్పుడే జూనియర్ను ఓన్ చేసేసుకుంటోందా ?
ఎవరి గోల వారిదే అన్నట్లుగా తాజా వివాదంలో జూనియర్ను బీజేపీ ఓన్ చేసేసుకుంటోంది. ఒకవైపు తమ్ముళ్ళంతా జూనియర్ ను ఇష్టం వచ్చినట్లుగా ర్యాగింగ్ చేస్తున్నారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడంపై ఎంత వివాదం రేగుతోందో అందరు చూస్తున్నదే. ఈ నేపధ్యంలోనే వివాదానికి దూరంగా ఉన్న జూనియర్ ను తమ్ముళ్ళంతా బాగా రెచ్చగొట్టారు. ఎన్టీయార్ వారసుడిగా ఉండికూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఖరిపై ఏమీ మాట్లాడరా ? అంటు పదే పదే రెచ్చగొట్టారు.
సరే వీళ్ళ బాధను అర్ధంచేసుకున్న జూనియర్ ఒక ట్వీట్ పెట్టారు. అందులో తమ్ముళ్ళు ఆశించినట్లుగా ప్రభుత్వంపై జూనియర్ రెచ్చపోకపోగా ఎన్టీయార్-వైఎస్సార్ ఇద్దరు గొప్ప ప్రజాధరణ ఉన్న నేతలే అని తేల్చేశారు. దాంతో టీడీపీ నేతలందరికీ జూనియర్ అంటే బాగా మండిపోయి నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. జూనియర్ అసలు ఎన్టీయార్ వారసుడేనా అని నిలదీస్తున్నారు. దాంతో జూనియర్ అభిమానులకు మండిపోయి ఎదురుదాడులకు దిగుతున్నారు. దాంతో విషయం కాస్త టీడీపీ వర్సెస్ జూనియర్ అన్నట్లుగా తయారైంది.
సరిగ్గా ఇక్కడే బీజేపీ సీన్లోకి ఎంటరైంది. జూనియర్ కు మద్దతుగా పార్టీ జాతీయ అధికారప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పెద్ద ట్వీట్ చేశారు. జూనియర్ ని ఎన్టీయార్ వారసుడివేనా అని అడగటం రాజకీయ వికృతానికి, దగా రాజకీయానికి పరాకాష్టగా మండిపోయారు. టీడీపీని దక్కించుకోవటం కోసం ఒకపుడు ఒక్క పోటు పొడిచి ఎన్టీయార్ మరణానికి కారకులైనవారు ఈరోజున ఆయనపై అతిప్రేమను ఒలకబోస్తున్నారంటు జీవీఎల్ మండిపోయారు.
ఈమధ్యనే అమిత్ షా-జూనియర్ భేటీ జరిగిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జూనియర్ ని సేవలందించమని అమిత్ అడిగారనేది ప్రచారం. అయితే అందుకు జూనియర్ ఏమి సమాధానం చెప్పారో ఎవరికీ తెలీదు. అప్పటినుండి జూనియర్, బీజేపీ నేతలు కలిసిందిలేదు. తమకు జూనియర్ సేవలందిస్తారని మాత్రమే కమలనాదులు చెబుతున్నారు. అయితే తాజా పరిణామాల్లో జూనియర్ ను బీజేపీ ఫుల్లుగా ఓన్ చేసేసుకోవటం ఆశ్చర్యంగా ఉంది.