ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పొజిషన్‌లో ఉండి తన వల్ల కాదని నేరుగా అంగీకరించారు. అమరావతి నగరాన్ని కట్టలేనని విశాఖలో పదివేల కోట్లు పెడితే వరల్డ్ క్లాస్ సిటీ అవుతుందని ఆయన ప్రకటించారు.అయితే మూడున్నరేళ్లుగా ఎందుకు ఆ రూ. పదివేల కోట్లు పెట్టలేదో మాత్రం చెప్పలేదు. పాలనా వికేంద్రీకరణపై స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి.. అభివృద్ది విషయంలో తనకేమీ చేతకాదన్నట్లుగానే ఎక్కువగా మాట్లాడారు. చేశానని చెప్పుకున్న కొన్ని పనులు టీడీపీ హయాంలోనివి కావడంతో చూసే వారికి జగన్ పాలనా సామర్థ్యంపై పూర్తి స్థాయిలో అనుమానం వచ్చేలా ప్రసంగం సాగింది. గతంలో కనిపించిన ఫైల్ ఈ సారి జగన్‌లో కనిపించకపోవడంతో ఎమ్మెల్యేలు కూడా పెద్దగా స్పందించలేదు.అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు అవుతుందంటూ గతంలో చెప్పిన కబుర్లనే చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అది కట్టడానికి మన దగ్గర డబ్బు లేదని తేల్చేశారు. అలా కట్టలేమన్నారు. ఏడాదికి రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగిన రాష్ట్రం ఏపీ అన్నారు.
మన రాష్ట్రంలో ప్రజలు ఎనభై శాతం మంది వైట్ కార్డు దారులన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. అంటే ఏపీలో ప్రజంలందరికీ వైట్ కార్డులు ఉంటాయి కాబట్టి రాజధాని కట్టాల్సిన అవసరం లేదన్నట్లుగా జగన్ మాట తీరు ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోయారు.అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలకు జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తాము ఎకరం పది కోట్లకు అమ్ముతానంటే ఎవరూ కొనడం లేదని చిన్న చిన్న స్థలాలు కూడా అమ్ముడుపోవడం లేదని ఇక రాజధానికి విలువ ఎక్కడ ఉందని జగన్ ప్రశ్నించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. విలువ లేని భూముల్లో కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ భూములకు విలువ ఎందుకు తగ్గిపోయిందో జగన్ రెడ్డికి తెలియదని ఎవరూ అనుకోలేరు. కానీ అలా ప్రజల్ని మభ్య పెట్టగలనని మాత్రం జనం అనుకుంటున్నారు. అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ కొంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని చేసి అమ్మకానికి పెట్టి ఎవరూ కొనడం లేదు. దానికి విలువ లేదని జగన్ చెప్పారన్నమాట.