ఆర్ఎంపీలను ఇకపై మెడికల్ డాక్టర్లుగా పిలవొచ్చు..
ఇకపై రోగులకు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ పై ఆర్‌ఎంపీలు మెడ్ డీఆర్ అనే ప్రిఫిక్స్ ప్రింట్ చేసుకోవచ్చు. అదే సమయంలో తమ రిజిస్ట్రేషన్ ఐడీని కూడా ప్రిస్క్రిప్షన్ పై తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. గతంలో రోగి, లేదా రోగి బంధువులు ఆర్ఎంపీలపై దాడి చేస్తే.. వారికి సరైన రక్షణ ఉండేది కాదు. ఇకపై ఆర్ఎంపీలపై దాడి చేసినా, తగిన రుసుము చెల్లించకపోయినా.. వైద్యాన్ని నిరాకరించే అవకాశాన్ని ఆర్ఎంపీలకు కల్పిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
కీలక ప్రతిపాదనలు ఇవీ..
ఆర్ఎంపీల వద్దకు వచ్చినప్పుడు నిర్ణీత రుసుము చెల్లించని రోగులకు వైద్యాన్ని ఆయా ఆర్‌ఎంపీలు నిరాకరించవచ్చు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో, లేదా ఎమర్జెన్సీ వైద్య సేవలు అవసరం ఉన్నప్పుడు మాత్రం వీరు వైద్యాన్ని నిరాకరించేందుకు అవకాశం లేదు. రోగికి సంబంధించిన ట్రీట్మెంట్ రికార్డు విషయంలో కూడా నిబంధనలు మార్చారు. ట్రీట్మెంట్ రికార్డును ఇవ్వడానికి గతంలో 3 రోజుల టైమ్ ఉండేది. ఇప్పుడది ఐదు రోజులుగా నిర్థారించారు. ఎమర్జెన్సీ కేసుల్లో మాత్రం అదేరోజు రికార్డులు సిద్ధం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గడచిన ఐదేళ్ల కాలంలో ఫార్మా కంపెనీలు, లేదా వైద్య రంగం నుంచి పొందిన ఆదాయాన్ని ఆర్ఎంపీలు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఆమేరకు ఆర్ఎంపీలు ఓ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని నేషనల్ మెడికల్ కమిషన్ పేర్కొంది. అయితే ఆర్ఎంపీలు వివిధ వైద్య విభాగాల్లో ప్రాక్టీస్ చేసినా కూడా.. ఒకే సమయంలో అన్నిటిలో కొనసాగకూడదు అనే నిబంధన కూడా విధించారు.