గుడ్‌ న్యూస్‌: రూ. 1200 కరోనా డోస్‌.. రూ.225కే?

Chakravarthi Kalyan
కేంద్రం 18 ఏళ్లు దాటిన వారికి ఇవాళ్టి నుంచి ప్రికాషన్ డోసులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. ఇవి ప్రైవేటులోనే వేస్తారు. అందువల్ల డబ్బు ఇచ్చి ఈ టీకాలు తీసుకోవాలి. ఇండియాలో ఎక్కువగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలే వేయించుకున్నారు. ఈ రెండు టీకాల డోసులు వేయించుకున్న వారు.. 9 నెలల గ్యాప్ తర్వాత ప్రికాషన్ డోసు తీసుకోవచ్చు. అయితే.. ఈ టీకాల ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి.


ప్రికాషన్ డోస్ ధరను భారత్ బయెటెక్, సీరం సంస్థలు రూ. 1200 పైగానే ప్రకటించాయి. అయితే ఈ ధర చాలా ఎక్కువగా ఉందని భావించడంతో ధరలు తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ సూచన మేరకు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా ధరలను తగ్గిస్తున్నట్లు ఈ  తయారీ సంస్థలు ప్రకటించాయి. దీంతో  12వందల రూపాయిలుగా ఉన్న కొవాగ్జిన్‌ టీకా ధర ఇప్పడు 225 రూపాయలు మాత్రమే. కోవిషీల్డ్ టీకా కూడా ఇంతే ధరకు లభిస్తోంది. దీనికి అదనంగా రూ. 150 రూపాయల వరకూ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది.


అంటే ప్రైవేటులో టీకా ప్రికాషన్ డోసు తీసుకోవాలంటే.. 400 రూపాయల వరకూ ఖర్చవుతుంది. ప్రికాషనరీ టీకాపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు  ప్రకటించిన భారత్ బయోటెక్, సీరం సంస్థలు తమ టీకాల ధరలను తగ్గించి ఆ రేట్లు ప్రకటించాయి. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి  వస్తాయని భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలు తెలిపాయి. ఇవాళ్టి నుంచి 18ఏళ్లు పైబడిన అందరు ప్రైవేటు టీకా కేంద్రాల్లో ఈ ముందస్తు డోసు వేసుకునేందుకు కేంద్రం పర్మిషన్ ఇచ్చింది.


అందుకే.. అనారోగ్యంతో బాధపడే వారు.. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని భావించే వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవడం మంచిది. కరోనా వచ్చి నానా ఇబ్బందులు పడే కంటే.. రాకుండా ప్రికాషన్ డోస్ తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇప్పుడు కరోనా భయం చాలా వరకూ తగ్గిపోయినందున ఈ ప్రికాషన్ డోసుకు ఆదరణ ఎలా ఉంటుందన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: