కొత్త జిల్లాలు కొత్త కలెక్టర్లు.. అందరికంటే హ్యాపీ ఎవరంటే..?
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా.. భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. దాదాపు పాతవారినే పాత జిల్లాలకు కొనసాగిస్తూ.. కొత్త జిల్లాల విషయంలో మాత్రం మార్పులు చేర్పులు చేసింది. వివిధ నగరాలకు కమిషనర్లుగా ఉన్న ఏఐఎస్ అధికారులను కొత్తగా ఏర్పడే జిల్లాలకు కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా బదిలీ చేశారు. ఎస్పీల విషయంలో కూడా ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోలేదు. పాతవారినే కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై జిల్లాకు ఒకరే జాయింట్ కలెక్టర్ ఉంటారు. గతంలో ముగ్గురు జాయింట్ కలెక్టర్లు ఉండేవారు. ఇప్పుడు కొత్త జిల్లాలకు కొంతమందిని బదిలీ చేయడం, మిగతా వారిని వివిధ నగరాలకు కమిషనర్లుగా పంపడంతో.. జిల్లాకు ఒకరే జాయింట్ కలెక్టర్ మిగులుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో.. జిల్లాల నైసర్గిక స్వరూపం కూడా మారుతుంది, వైశాల్యం తగ్గుతుంది కాబట్టి జిల్లాకు ఒకరే జాయింట్ కలెక్టర్ ని నియమిస్తున్నారు.
ప్రస్తుతానికి బదిలీల లిస్ట్ అంతా ప్రిపేర్ అయింది. ఎక్కడివారక్కడ కొత్త జిల్లాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే చివరి నిముషంలో వీటిలో మార్పులు చేర్పులుంటాయేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి రాజకీయ పలుకుబడులు ఈ బదిలీల్లో చోటు చేసుకోలేదు. ఒకవేళ.. రేపు కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాజకీయ పలుకుబడులతో బదిలీలు కూడా జరిగే అవకాశముంది. అప్పటి వరకు పాత జిల్లాలకే పరిమితమైన ఉన్నతాధికారుల పని హ్యాపీ అంటున్నారు.