హైదరాబాద్ : ఆప్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లేనా ?
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ప్లానులోనే ఉన్నట్లున్నారు. మరో రెండేళ్ళల్లో రాబోతున్న తెలుగురాష్ట్రాల్లో ఆప్ తరపున అభ్యర్ధులను పోటీలోకి దింపాలని డిసైడ్ అయ్యారట. తెలంగాణాతో పాటు ఏపీ పైన కూడా దృష్టిపెట్టారని సమాచారం. ఢిల్లీ ఉపముఖ్యమత్రి, తెలంగాణా ఇన్చార్జి సోమనాధ్ భారతి తెలంగాణాలో పర్యటించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఆప్ పోటీచేస్తుందన్నారు.
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అంటు బీజేపీ, కాంగ్రెస్ ఊదరగొడుతున్నాయి. వాస్తవం ఏమిటో కాలమే నిర్ణయించాలి. అయితే వీటికి పోటీగా ఆప్ కూడా రంగంలోకి దిగుతోంది. ఈ పార్టీల్లో దేనికీ లేని క్లీన్ ఇమేజి ఆప్ సొంతం కాబట్టి జనాలు సానుకూలంగా స్పందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పంజాబ్ లో జనాలు ఆప్ ను గెలిపించుకోవటం వెనుక క్లీన్ ఇమేజీయే ప్రధాన కారణం. ఇప్పటికే తెలంగాణా జనాలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలతో విసిగిపోయున్నారు.
సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవటంతోనే వీటిల్లో ఏదోపార్టీకి ఓట్లేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో జనాల్లో నమ్మకం కలిగించగలిగితే ఆప్ వైపు ఓటర్లు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వచ్చేస్తుందని ఎవరు అనుకోవటంలేదు. కాకపోతే వచ్చే ఎన్నకల్లో ఆప్ తనదైన ముద్ర వేస్తే జనాలు తర్వాత ఎన్నికలకైనా ఆప్ వైపు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంది. పంజాబ్ లో 12 ఏళ్ళు ప్రతిపక్షంలో పనిచేసిన తర్వాత ఆప్ బంపర్ విజయం సాధించింది. మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, బెంగాల్, యూపీ ఎన్నికల్లో కూడా పాల్గొన్నది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పై కన్నేసింది.
ఇందులో భాగంగానే తెలంగాణా తర్వాత ఏపీలో కూడా వీలైనన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది. ఇందుకు అవసరమైన యాక్షన్ ప్లాన్ తొందరలోనే రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఆప్ లోని కొందరు కీలక వ్యక్తులకు సర్వే బాధ్యతలు అప్పగించారట. అలాగే వివిధ సామాజికవర్గాల్లోని ప్రముఖులను కలవటం ఆప్ లోకి ఆహ్వానించే బాధ్యతలను కూడా అప్పగించినట్లు సమాచారం. ఆప్ కున్న క్లీన్ ఇమేజికి జనాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లోనే ఆప్ తన ముద్రను చూపించినా ఆశ్చర్యంలేదు.