నేను ఫుల్ బిజీ: టీఆర్ఎస్ మంత్రులకు కేంద్ర మంత్రి షాక్?
ధాన్యం అంశంపై చర్చించేందుకు తెలంగాణ మంత్రులు దిల్లీకి వచ్చారని.. వారికి అపాయింట్మెంట్ ఇవ్వాలని పీయూష్ ను కేకే అడిగారు. అయితే.. కేంద్ర మంత్రిగా చాలా బిజీగా ఉన్నానని.. తనకున్న షెడ్యూల్, పార్లమెంట్, ఇతరత్రా సమావేశాల టైమింగ్ చూసుకుని.. వారికి అపాయింట్ మెంట్ ఇస్తానో లేదో చెప్తానని పీయూష్ గోయల్ అన్నట్టు తెలిసింది. అయితే పీయూష్ గోయల్ రేపు మధ్యాహ్నం తనను తెలంగాణ మంత్రులు కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు.
అయితే ఈ భేటీ జరుగుతుందా.. లేదా అన్న విషయంపై ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే.. గతంలోనూ ఇలాగే దిల్లీ వచ్చిన తెలంగాణ మంత్రులు తమను పీయూష్ గోయల్ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అందుకే మరోసారి తెలంగాణ మంత్రులకు అలాంటి సీన్ చేసే అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే.. టీఆర్ఎస్ రాజకీయం కోసం వడ్ల కొనుగోలు అంశాన్ని వాడుకుంటోందని కేంద్రం మండిపడుతోంది.
రాజకీయం కోసం టీఆర్ఎస్ చేసే షోకు తాము ఎందుకు అవకాశం ఇవ్వాలని పీయూష్ గోయల్ వంటి కేంద్ర మంత్రులు భావించే అవకాశం ఉంది. అయితే.. తెలంగాణ మంత్రులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ యాసంగి ధాన్యంలో ప్రతి గింజనూ కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ హామీ తీసుకునేందుకే తాము దిల్లీ వచ్చామని చెబుతున్నారు. దీనికి వేరే ప్రత్యామ్నాయమే లేదంటున్నారు. ఈ విషయాన్ని పీయూష్ గోయల్ వద్ద గట్టిగా చెబుతామంటున్నారు.