ధాన్యం గొడవ.. మళ్లీ మాట మార్చిన కేంద్రం?

Chakravarthi Kalyan
తెలంగాణ, కేంద్రం మధ్య మరోసారి ధాన్యం గొడవ బాగానే జరిగేలా కనిపిస్తోంది. తెలంగాణలో యాసంగిలో పండిన ముడి ధాన్యం అంతా కొనాల్సిందేనని తెలంగాణ పట్టుబడుతోంది. పంజాబ్‌లో పండిన ధాన్యం అంతా కొంటున్నప్పుడు తెలంగాణ నుంచి ఎందుకు కొనరని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం పోరాటం ఉధృతం చేసింది. ఇటీవల కేంద్రంతో సంబంధాలు బెడిసి కొడుతున్న సమయంలో కేసీఆర్ కూడా పోరాటానికే రెడీ అయ్యారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటున్నారు.

ఎలాగూ బీజేపీతో రాజకీయ యుద్ధం సాగిస్తూనే ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ధాన్యం విషయంలో తగ్గేదే లేదంటున్నారు. అయితే.. మొన్నటికి మొన్న.. మేం తెలంగాణలో పండే ధాన్యం అంతా కొంటాం.. కొనడం లేదని మీకు ఎవరు చెప్పారు అని స్వయంగా పీయూష్‌ గోయల్‌ సమాధానం ఇచ్చారు.. దీంతో గొడవ దాదాపు ఓ కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. కానీ ఇప్పడు సీన్ మళ్లీ మొదటికి వస్తోంది. ఎందుకంటే ఇప్పడు పీయూష్ గోయల్ మరోసారి తేడాగా మాట్లాడారు.

పీయూష్ గోయల్ ఏమంటున్నారంటే.. రాష్ట్రాల్లో ఉత్పత్తి ఆధారంగా ధాన్యం సేకరణ సాధ్యపడదట. లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్‌, సాధ్వి నిరంజన్‌ జ్యోతి ఈ విధంగా లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. ధాన్యం సేకరణ అంశంలో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని వారు చెబుతున్నారు. వాటిలో కనీస మద్దతు ధర, డిమాండ్, సరఫరా, మార్కెట్లో ఉన్న ధరలు, ఇతర పరిస్థితులు ఉంటాయని.. వాటి ఆధారంగానే సేకరణ ఉంటుందని తెలిపారు.

గోధుమలు, వరి ధాన్యాన్ని నిర్దిష్ట పరిధి, నాణ్యతతో సేకరిస్తామని పీయూష్ గోయల్ వివరించారు. ఎఫ్‌సీఐతో చర్చించిన తర్వాత ప్రణాళిక రూపొందించిన దాని ప్రకారం ధాన్యాన్ని సేకరిస్తామని పీయూష్ గోయల్ అంటున్నారు. దీంతో మరోసారి కేంద్రం, తెలంగాణ మధ్య రైస్ వార్ ముదిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.. ఈ ధాన్యం వివాదం ఎలా ముగుస్తుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: