తెలంగాణ హైకోర్టుకు గుడ్ న్యూస్..?

Chakravarthi Kalyan
తెలంగాణకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ హైకోర్టుకు మరో 10 మందిని న్యాయమూర్తులుగా నియమించింది. కొలీజియం సిఫార్సు చేసిన 12 పేర్లలో 10 మందికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి నియామకం చేశారు. ఈ పది మందిలో ఏకంగా నలుగురు మహిళలకు స్థానం లభించింది. వీరంతా రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని కొలీజియం మొత్తం 12 మంది పేర్లను సిఫారసు చేసింది. వీరిలో  న్యాయవాదుల కేటగిరీ నుంచి ఏడుగురు, న్యాయాధికారుల కేటగిరీ నుంచి అయిదుగురు ఉన్నారు. కొలీజియం మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేస్తే.. వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఓకే చెప్పేశారు.


ఈ కొత్త న్యాయమూర్తుల్లో న్యాయవాదుల విభాగం జాబితాలో కాసోజు సురేందర్‌, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, ఎన్‌.శ్రావణ్‌ కుమార్‌ వెంకట్‌ ల పేర్లు ఉన్నాయి. అలాగే న్యాయాధికారుల విభాగం జాబితాలో గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, దేవరాజ్‌ నాగార్జున్‌ల పేర్లు ఉన్నాయి. ఈ పది మందిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ కూడా  మంగళవారం రాత్రే ఆదేశాలు జారీ చేసేసింది.


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 217(1)కింద వచ్చిన అధికారాల ప్రకారం వీరి నిమాయకాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న క్రమంలోనే ఈ కొత్త జడ్జిలకు సీనియారిటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారి నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  కొత్తగా నియమితులైన ఈ  పది మంది న్యాయమూర్తులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ఈ పది మందితో రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కొత్తగా పది మంది నియామకాలతో తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కు చేరనుంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాలి. అంటే మరో 13 ఖాళీలు ఉన్నాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: