
ఈ 10 గంటలకు కేసీఆర్ చేసే సంచలన ప్రకటన ఇదే?
అయితే.. ఇంతకీ కేసీఆర్ చేయబోయే ఉద్యోగ ప్రకటన ఏంటంటే.. లక్ష ఉద్యోగాల భర్తీతో పాటు కొత్త పోస్టులు కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇవాళ ఈ ఉద్యోగాల నియామకపు క్యాలెండర్‌ను కేసీఆర్ అసెంబ్లీలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలవారీగా భర్తీ చేసే స్థానిక ఉద్యోగాల వివరాలను కేసీఆర్ ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంటే తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టబోతోందన్నమాట.
ఈసారి ఏకంగా లక్ష కొలువుల భర్తీకి రూట్ మ్యాప్ ప్రకటిస్తారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీ గురించి కూడా కేసీఆర్ స్పష్టత ఇస్తారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో అమలు చేసేలా ఈ క్యాలెండర్‌ను విడుదల చేస్తారు. పలు శాఖల్లోని ఖాళీలు, ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులు, కొత్త పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఉన్నవి వంటి వివరాలు వెల్లడిస్తారు. కొత్తగా అనుమతి ఇవ్వాల్సిన వాటి వివరాలు కూడా కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ పరంగా కసరత్తు పూర్తయింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, గురుకులాల రిక్రూట్‌మెంట్ బోర్డు, పంచాయతీరాజ్ సర్వీసెస్ నియామక బోర్డు, సింగరేణి రిక్రూట్‌మెంట్ బోర్డులతో భర్తీ చేసే పోస్టులపై ఓ అవగాహనకు వచ్చింది. ప్రాధాన్యక్రమంలో పోస్టుల నియామక ప్రక్రియపై కేసీఆర్ అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులతో పాటు గురుకులాల పోస్టులు, పోలీసు పోస్టులపైనా కేసీఆర్ ప్రకటన చేయవచ్చు. ఉద్యోగ నియామకాలకు స్పష్టమైన కాల పరిమితిని నిర్ణయిస్తూ కేసీఆర్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం అన్నట్టు విశ్వసనీయ సమాచారం.