ఉక్రెయిన్‌ : మోదీ.. ఆ మాట పుతిన్‌కు చెప్పండి!

Chakravarthi Kalyan
రష్యా ఉక్రెయిన్‌ పై దాడి తీవ్రం చేస్తున్న సమయంలో ప్రపంచమంతా నిస్సహాయంగా చూస్తోన్న పరిస్థితి నెలకొంది. రష్యాను ఏమైనా అంటే అది కాస్తా ప్రపంచ యుద్ధానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంది. అందుకే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. రష్యాను ఎలా దారికి తేవాలా అని ఆలోచిస్తున్నాయి. కానీ.. ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. వందల కొద్దీ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కొక్కటిగా ఉక్రెయిన్ నగరాలను రష్యా ధ్వంసం చేస్తోంది. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకునే వరకూ ఈ దాడులు ఆగేలా కనిపించడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్ భారత్‌ వైపు చూస్తోంది. ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసమైనా తమపై యుద్ధం ఆపమని ఆ దేశం కోరుకుంటోంది. ఈ మేరకు యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు విజ్ఞప్తి చేయాలని ఉక్రెయిన్‌ అడుగుతోంది. ఈ విషయంలో భారత్ సాయం కోరుతోంది. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దిమిత్రో కులేబా ఈ మేరకు భారత ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దిమిత్రో కులేబా తన దేశపు టీవీలో ప్రసంగించారు.

విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దిమిత్రో కులేబా ఏమంటన్నారంటే.. ఉక్రెయిన్‌ వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌ అతిపెద్ద వినియోగదారు. యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్ కొత్త పంటలు వేసే అవకాశం ఉండదు. అప్పుడు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు ఆహార ఇబ్బందులు వస్తాయి. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అయినా ఈ యుద్ధం ఆపాలని పుతిన్‌కు భారత్ విజ్ఞప్తి చేయాలని అని అంటున్నారు.

అంతే కాదు.. భారత పౌరులు కూడా నరేంద్ర మోడీపై ఈ విషయంలో ఒత్తిడి తీసుకురావాలని విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి దిమిత్రో కులేబా కోరుతున్నారు. రష్యాకు భారత్‌ మంచి స్నేహితుడు.. భారత్‌ చెబితే రష్యా వింటుందన్న ఆశ కూడా ఉక్రెయిన్ దేశానికి ఉంది. అందుకే రష్యా యుద్ధం ఆపేందుకు ఇండియా తన వంతు ప్రయత్నం చేయాలని ఆ దేశం కోరుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: