అది జరిగితేనే అసెంబ్లీకి.. నారా లోకేష్ డిమాండ్ ఏంటంటే..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7 నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా..? వద్దా? అనే విషయంపై టీడీపీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ విషయంపై టీడీపీ పోలిట్ బ్యూరో అమరావతిలో భేటీ అయి సుదీర్ఘ చర్చ జరిపింది. చంద్రబాబు సతీమణిపై సభలో మంత్రులు దారుణ వ్యాఖ్యలు చేశారని, వారు బేషరతుగా క్షమాపణలు చెప్పేదాకా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని టీడీపీ పొలిట్ బ్యూరోలోని మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయం తెలిపారు. మంత్రులు క్షమాపణలు చెప్పని పక్షంలో ఎలాంటి వ్యూహం అవలంబించాలనే దానిపై పొలిట్ బ్యూరోలో ఏకాభిప్రాయం రాలేదు. దీంతో దీన్ని టీడీపీఎల్పీకి బదలాయించారు.
లోకేష్ ఏమంటున్నారు..?
తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రులు బేషరతుగా క్షమాపణ చెబితేనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలన్న పొలిట్ బ్యూరో నిర్ణయం సరైనదేనని అంటున్నారు నారా లోకేష్. అయితే రాష్ట్ర ప్రజల సమస్యలను కూడా టీడీపీ దృష్టిలో ఉంచుకుంటుందని ఆయన చెప్పారు. సమస్యలపై చర్చించేందుకు, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు సమావేశాలకు వెళ్లాలనే ఉద్దేశం కూడా ఉందని అంటున్నారు. అయితే మంత్రుల క్షమాపణకే తాము కట్టుబడి ఉంటామని అంటున్నారు లోకేష్. ఈ విషయంలో టీడీఎల్పీ సమావేశంలో పార్టీ నాయకులు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.