శివాలెత్తిన పుతిన్: ఉక్రెయిన్‌లో రష్యా సేనల బీభత్సం?
కీవ్ తో పాటు అనేక నగరాలపై రష్యా బలగాలు దృష్టి సారించాయి. మారియుపోల్ తో పాటు ముఖ్య నగరాల్లో ఇరుసైన్యాల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా వైమానిక దాడులు చేశాయి. ఈ రష్యా వైమానిక దాడుల్లో కీవ్‌లోని ప్రధాన టీవీ టవర్ ధ్వంసమైపోయింది. ఈ దాడిలో ఐదుగురు ఉక్రెనియన్లు కూడా చనిపోయినట్లు ఆ దేశం అధికారులు వెల్లడించారు. రష్యా సేనలు చేసిన దాడిలో టీవీ కంట్రోల్ రూమ్, విద్యుత్ సబ్‌స్టేషన్ కూడా దెబ్బ తిన్నాయని ఉక్రెయిన్ చెబుతోంది.
కీవ్‌లో టీవీ టవర్‌పై దాడి చేసిన విషయాన్ని రష్యా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించింది. ఉక్రెయిన్ నిఘా విభాగం ఉపయోగిస్తున్న ప్రసార సౌకర్యాలే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోంది. రష్యా ఇప్పటి వరకూ ఉక్రెయిన్ పై 56 రాకెట్లు ప్రయోగించినట్టు ఉక్రెయిన్ చెబుతోంది. వీటితో పాటు రష్యా 113 క్షిపణులను కూడా ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఇప్పటి వరకూ రష్యా సైన్యం చేసిన దాడుల్లో 14మంది చిన్నారులతో పాటు 352మంది ఉక్రెనియన్లు మృతి చెందినట్టు ఆ దేశం ప్రకటించింది.
రష్యా తన దాడులతో ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులను కూడా లక్ష్యంగా చేసుకుందని ఉక్రెయిన్ ఆక్రోశిస్తుంటే.. అబ్బే.. మేం జనావాసాలపై దాడులు చేయడం లేదని రష్యా చెబుతోంది. మరోవైపు రష్యా చేసిన దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకూ 10లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఉక్రెయిన్ నుంచి 6.60లక్షల మందికిపైగా తరలివెళ్లిపోయారని ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.