దిగజారుతున్న పరిస్థితులు.. రంగంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ పరిస్థితులు మరింత దిగజారుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను ఆపరేషన్ గంగాలో భాగంగా విమానాల్లో తరలిస్తోంది. అయితే ఇంకా వేలమంది అక్కడే ఉండిపోవడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. దీంతో ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17 విమానాలు భారతీయులను వేగంగా.. సురక్షితంగా తీసుకొచ్చేందుకు గాల్లోకి లేవనున్నాయి.
ఇక ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనేక కష్టాలు పడుతున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకునేందుకు.. రైళ్లలో ఎక్కేందుకు ఆహారం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఉక్రెయిన్ దేశస్థులు భారతీయులను చూసి.. రైళ్లు ఎక్కనీయకుండా డోర్లు మూసేస్తున్నారు. దీంతో స్వదేశానికి చేరుకుంటామో.. లేదోనని భారతీయ విద్యార్థులు బాధపడుతున్నారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పక్క దేశాలకు వెళ్తున్న భారతీయులకు అక్కడి ప్రజలు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. పొలాండ్ లో భారతీయులకు వేడి వేడి ఆహారం, డ్రైఫ్రూట్స్ అందిస్తున్నారు. భారత విమానాలు వచ్చే వరకు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో గుజరాత్ జామ్ నగర్ మహారాజు వెయ్యి మంది పొలాండ్ పిల్లలకు ఆశ్రయం ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు.
మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా జరుపుతున్న దాడులతో పెద్ద సంఖ్యలో పౌరులు పొరుగు దేశాలకు వలసపోతున్నారు. ఆరు రోజుల్లో సుమారు 6లక్షల 60వేల మంది ఉక్రెయిన్ సరిహద్దులు దాటారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. పురుషుల సైనిక పోరులో సహకరించేందుకు దేశంలోనే ఉండటంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు దేశం విడిచి వెళ్తున్నారు. అయిన వారిని వదల్లేక భారమైన హృదాయాలతో సరిహద్దులను వీడుతున్నారు.
ఇక దేశాన్ని కాపాడుకోవడం కోసం ఉక్రెయిన్ పోరాడుతోంది. రష్యా సేనల దాడులతో ఆ దేశ పౌరులు సరైన తిండి.. నిద్ర లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఏ క్షణం.. ఎక్కడ నుంచి బాంబులు పడతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టు అనధికారిక సమాచారం. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: