రష్యాకు షాక్ ల మీద షాక్ లు..!

NAGARJUNA NAKKA
ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై భీకర దాడులు జరుపుతున్న రష్యాకు.. ఉక్రెయిన్ సేనలు అదే స్థాయిలో సమాధానమిస్తున్నాయి. ఇప్పటి వరకు 5వేల 710మంది రష్యా సైనికుల్ని హత మార్చడంతో పాటు 29 విమానాలు కూల్చినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. అలాగే 29హెలికాప్టర్లు, 198 ట్యాంకులు, 846 సాయుధ శకటాలు, 305 వాహనాలు, 60ఇంధన ట్యాంకులు, 7 డ్రోన్ లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.

ఇక యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రసంగం ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. తమ నేల.. స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామనీ.. తమను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరన్నారు. తాము ఉక్రెయిన్లమనీ.. బలంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. జెలెన్ స్కీ మాటలకు ఈయూ పార్లమెంట్ సభ్యులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మరోవైపు ఉక్రెయిన్ కు ఈయూ దేశాలు 70ఫైటర్ జెట్లు అందించనున్నాయి.

ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆరో రోజు కొనసాగుతోంది. ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతమైన ఒకిట్రికా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. ఇందులో 70మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. నాలుగు అంతస్థుల భవనం కూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఫిబ్రవరి 27వరకు 406మంది ఉక్రెయిన్ సాధారణ పౌరులు చనిపోయినట్టు తెలుస్తోంది. 4వేల 500మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్ చెబుతోంది.

ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడిన రష్యాను ప్రపంచ దేశాలు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితిలో రష్యా దౌత్య మిషన్ లోని 12మంది సభ్యులను బహిష్కరిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది.ఈ విషయమై యూఎన్ఓలో రష్యా శాశ్వత ప్రతినిధి నెబెంజియా మాట్లాడుతూ రష్యా పట్ల అమెరికా తీరును తప్పుపట్టారు. మరోవైపు వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రోస్, సోని సంస్థలు తమ సినిమాలను రష్యాలో విడుదల చేసేదిలేదని ప్రకటించాయి.

ఇక రష్యాతో కలిసి ఉక్రెయిన్ పై దాడి చేసే ఆలోచన తమకు లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో అన్నారు. అలాగే బెలారస్ భూభాగం నుంచి రష్యా దళాలు ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నాయన్న వార్తలను కూడా లుకాషెంకో ఖండించారు. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మొదటి నుంచి రష్యాకు బెలారస్ మద్ధతు నిలుస్తోంది.











మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: