నేషనల్ డ్రీమ్స్: ఢిల్లీలో కేసిఆర్.. కేజ్రీవాల్ తో భేటీ?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లారు.. ఇటీవల జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన కేసీఆర్ ఇప్పుడు ఆ పని మీదే డిల్లీ వెళ్లారు.. ఇప్పటికే బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై ఆలోచిస్తున్న కేసీఆర్.. ఆ ప్రయత్నంలోనే ఢిల్లీ యాత్ర చేస్తున్నారు. ఆయన ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ వంటి వారితో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో కేసీఆర్ ఆప్ అధినేత కేజ్రీవాల్‌ తో పాటు ఇతర పార్టీల జాతీయ నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది.

ఎలాగైనా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ప్లాన్‌.. అంతే కాదు.. ఆ కూటమిలో తాను కీలక పాత్ర పోషించాలన్నది ఆయన వ్యూహం. ఆ సన్నాహాల్లో భాగంగానే ఇప్పుడు కేసీఆర్‌.. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అవుతున్నారు. తెలంగాణ, ఢిల్లీ సీఎంలైన కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య ఇదే తొలి భేటీ కావడం విశేషం. ఈ సమావేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర  కూటమి ఏర్పాటు గురించి చర్చించే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కూడా చాలా కాలంగా బీజేపీ పై పోరాడుతున్నారు. ఢిల్లీలో ఆయన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీయే.

అంతే కాదు.. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లోనూ ఆప్‌ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్, కేజ్రీవాల్ భేటీ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. కేజ్రీవాల్‌ తో భేటీ తర్వాత కేసీఆర్ మరికొన్ని జాతీయ పార్టీల నాయకులను కూడా కలుస్తారని తెలుస్తోంది. పార్టీల నాయకులే కాదు.. రిటైర్డ్ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతోనూ కేసీఆర్ సమావేశమవుతారని తెలుస్తోంది.

ఇప్పటికే జాతీయ రాజకీయాల కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసుకుంటున్న కేసీఆర్.. జాతీయ ప్రత్యామ్నాయ వేదిక రూపకల్పనలో పాలుపంచుకోవాలని వారిని కేసీఆర్ ఆహ్వానించవచ్చని తెలుస్తోంది. తన కొత్త బృందంలో చేరాలని వారిని కోరే అవకాశం ఉంది.  నిన్న రాత్రి ఆయన బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో కేసీఆర్‌ వెంట మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: