ఉక్రెయిన్‌: మోదీ సంచలన నిర్ణయం.. పుతిన్‌కు కోపం రాదా?

Chakravarthi Kalyan
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి ఇండియా పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్టుగా ఉంది.. ఓ పక్క రష్యాతో చిరకాల స్నేహ బంధం.. మరోపక్క.. యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న రష్యా.. గట్టిగా ఖండించలేము.. అలాగని సపోర్ట్ కూడా చేయలేంది.. దీంతో ఎలా స్పందించాలో తెలియక మోదీ సర్కారు మొదట్లో జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి..అందుకే.. రష్యా యుద్దోన్మాదంపై అమెరికా ఐక్య రాజ్య సమితిలో తీర్మానం పెడితే.. ఏమీ చేయలేక.. ఓటింగ్‌ కు దూరంగా ఉండిపోయింది ఇండియా.


రష్యాతో ఇండియాది ఈ నాటి బంధం కాదు.. సోషలిజం అంటే మక్కువ చూపే మన భారత నిర్మాత, మొదటి ప్రధాని నెహ్రూ.. రష్యాను చాలా అభిమానించేవారు.. అలా తొలితరం నుంచే ఇండియాకు రష్యాతో స్నేహం కుదిరింది. అప్పటి నుంచి ఇండియాకు రష్యా నమ్మకమైన స్నేహితుడు. అనేక రంగాల్లో రష్యా ఇండియాకు సాయం చేసింది. రష్యా సహకారంతోనే ఇండియా పారిశ్రామికంగానూ ఎదిగింది. అయితే ఎంత స్నేహితుడు అయినా తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పగలగాలి. కానీ అలా చెబితే ఇండియాకు నష్టం.. అందుకే ఇండియా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది.  


కానీ తాజాగా ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇవాళ ఉన్నత స్థాయి సమావేశాలు మూడు, నాలుగు జరిగాయి. ఇంత తక్కువ సమయంలో ఇలా మోడీ సమావేశాలు నిర్వహించడం చాలా అరుదు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ భేటీలు కీలకంగా మారాయి. ఈ భేటీల్లో ప్రధానంగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై చర్చించారు. అంతే కాదు.. ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపాలని నిర్ణయించారు.


అయితే ఈ భేటీల్లో మరో  కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఉక్రెయిన్ కు మానవతా దృక్పధంతో సహకారం అందించాలని మోదీ నిర్ణయించారు. రష్యా దాడుల్లో గాయపడుతున్న ఉక్రెయిన్‌ వాసుల కోసం మందులు, ఇతర సహాయక సామాగ్రి పంపాలని ఇండియా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి ఇలా చేస్తే పుతిన్‌ కు కోపం రాదా.. ఏమో.. మోదీ ఎలా మేనేజ్‌ చేస్తారో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: