పవన్‌ను జగన్ టార్గెట్ చేశారు.. నాగబాబు ఆక్రోశం..?
ఈ అంశంపై పవన్ కల్యాణ్ నేరుగా స్పందించకపోయినా.. ఇప్పుడు ఆయన సోదరుడు నాగబాబు మాత్రం ఘాటుగానే స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీరుపై నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమతోపాటు పవన్ ను టార్గెట్ చేసిందన్న నాగబాబు... వకీల్ సాబ్ నుంచి భీమ్లానాయక్ వరకు ప్రభుత్వం పవన్ పై కక్ష్య కట్టిందన్నారు. సినిమా టికెట్ ధరలపై ఇంకా జీవో విడుదల చేయడం లేదని.. జీవో విడుదలలో ఎందుకు జాప్యం జరుగుతుందని నాగబాబు ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వంలో ఉండేది ఐదేళ్లేనని గుర్తించాలని.. జగన్ సర్కారు మళ్లీ ప్రజాక్షేత్రంలో నిల్చొని ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని.. ప్రజలు జగన్‌కు శాశ్వతంగా అధికారం ఇవ్వలేదని నాగబాబు అన్నారు. ఐదేళ్ల పాటు మీరు ఏ తప్పులు చేసినా ప్రజలు భరిస్తున్నారని.. పవన్ కల్యాణ్ పై పగపట్టి ఇంత చేస్తుంటే ఎవరూ నోరు మెదపడం లేదని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించకపోవడం దురదృష్టకరమన్న నాగబాబు.. నిర్మాతలు, దర్శకులు, హీరోలకు ఇది తప్పు అని చెప్పడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ వంటి ఒక అగ్ర హీరోకే ఇంత జరుగుతుంటే ఇక ఏపీలో సామాన్యుల పరిస్థితి ఏంటని నాగబాబు ప్రశ్నించారు. సినీ పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని పవన్ అర్థం చేసుకుంటున్నాడని.. అయితే.. భవిష్యత్ సినీ పరిశ్రమలో ఇలాంటి సమస్య ఎవరికైనా వస్తే తాము సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని నాగబాబు అన్నారు. ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా సమస్య వస్తే మేం ముందుటామని.. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుందని నాగబాబు అంటున్నారు.