సరిగ్గా 44 ఏళ్ల క్రితం: బాబు జీవితంలో మరపురానిరోజు..?
ఈ సందర్భంగా పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ గత స్మృతులు గుర్తు చేసుకున్నారు.. తాను తిరుపతి యూనివర్శిటీలో చదివే రోజుల్లోనే యూనివర్సిటీ లీడర్ గా ఎదిగానని.. ఆ తర్వాత అసెంబ్లీకి పోటీ చేశానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే.. మొదటి సారి గెలిచిన వెంటనే చంద్రబాబు తనకు మంత్రి పదవి కావాలని అప్పటి సీఎం చెన్నారెడ్డిని అడిగారట.. ప్రజలకు సేవ చేయాలంటే పదవి కావాలని చంద్రబాబు సమాధానం చెప్పారట.
చంద్రబాబు మాటలకు మెచ్చుకున్న చెన్నారెడ్డి తొలిసారి గెలిచిన చంద్రబాబుకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత అనేక ఆటుపోట్లతో తన రాజకీయ ప్రయాణం సాగిందని.. కానీ సాధించాలి అనే తపన మాత్రం నాలో తగ్గలేదని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తొలిసారి చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా ఆ పదవి చేపట్టడం వల్లే.. అప్పట్లో తొలిసారి ఎన్టీఆర్ ను చంద్రబాబు కలిశారట.
ఇక ఆ తర్వాత జరిగిన వ్యవహారం చాలా వరకూ తెలిసిందే. చురుకుగా ఉండే చంద్రబాబు ఎన్టీఆర్ కంట్లో పడ్డారు. ఆ పరిచయం కాస్త ఈ కుర్రాడికి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబుకు భువనేశ్వరినిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడం.. అందులో చంద్రబాబు కూడా చేరడం జరిగిపోయాయి. ఎన్టీఆర్ అల్లుడు కావడం వల్ల పార్టీలో చంద్రబాబు త్వరగానే ఎదిగారు.. చివరకు ఎన్టీఆర్ కే ప్రత్యామ్నాయంగా మారి.. ఆయన్ను పదవి నుంచి దింపేసి మరీ సీఎం అయ్యారు. అలా ఫిబ్రవరి 25 చంద్రబాబు జీవితంలో మరపురాని రోజు అయ్యింది.