అమరావతి : ఇలాగైతేనే బీజేపీకి ఎదిగే అవకాశాలున్నాయా ?
బీజేపీ వ్యవహారం చూస్తుంటే ఇలాంటి అనుమానాలే పెరిగిపోతున్నాయి. మామూలుగా అయితే బీజేపీకి రాష్ట్రంలో సీన్ లేదు. సొంతంగా పోటీచేస్తే పార్టీ అభ్యర్ధుల్లో ఎవరికి కూడా డిపాజిట్లు దక్కే అవకాశం కూడా లేదు. అయితే ఏదన్నా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం నాలుగు సీట్లు వస్తాయని ఇప్పటికే రుజువైంది. ఇపుడు రాష్ట్రంలో బలమైన పార్టీలంటే వైసీపీ, టీడీపీలు మాత్రమే. ఇప్పటికే తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకోవటం విడిపోవటం అన్నీ అయిపోయాయి.
ఇక మిగిలింది వైసీపీ మాత్రమే. ప్రస్తుతానికి జనసేనతో మిత్రపక్షంగా ఉన్నా రేపటి ఎన్నికల్లో ఎన్ని సీట్లలో గెలుస్తుందో చెప్పలేరు. ఎందుకంటే జనసేనకే దిక్కులేదంటే ఇక బీజేపీని పవన్ కల్యాణ్ ఏమి గెలిపించగలరు ? కాబట్టి బీజేపీకి వచ్చే ఎన్నికల్లో నాలుగు సీట్లు రావాలంటే వైసీపీతో పొత్తు పెట్టుకోవటం ఒక్కటే మార్గం. వైసీపీతో పొత్తు పెట్టుకోవాలంటే రాష్ట్రప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పదు. వైసీపీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీకి పెద్దగా సీట్లు వచ్చే అవకాశాలు ఇప్పటికైతే కనబడటంలేదు.
రాష్ట్ర ప్రయోజనాలంటే ప్రధానంగా ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయటమే. పై రెండింటిని కేంద్రంలోని పెద్దలు ఫుల్ ఫిల్ చేసి వైసీపీతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఖాయంగా కొన్ని సీట్లు వచ్చే అవకాశముంది. ఏపీ ప్రయోజనాల కోసం తాము ఈ పనులు చేశామని, ఇంత నిధులు మంజూరు చేశామని, ఏపీ ప్రయోజనాలను రక్షించామని చెప్పుకోవాలంటే బీజేపీ పై రెండు పనులు చేయకతప్పదు.
గడచిన ఎనిమిదేళ్ళల్లో ఏపీకి అంత చేశాం ఇంత చేశామని కమలనాదులు చెబుతున్నదంతా సొల్లుకబుర్లే అని అందరికీ తెలుసు. ఎలాగంటే దేశమంతటికి ఇస్తున్న నిధుల్లో భాగంగానే ఏపీకి కూడా కేంద్రం ఇస్తోంది. అంతేకానీ ప్రత్యేకించి ఏపీకి ఇస్తున్నదంటు ఏమీలేదు. పైగా విభజన చట్టాన్ని నూరుశాతం తూట్లు పొడిచేయటంతో జనాలు బీజేపీ అంటేనే మండిపోతున్నారు. కాబట్టి నాలుగు సీట్లు గెలుచుకోవాలంటే అవకాశాలను ఉపయోగించుకోవాల్సిందే.