నెల్లిమర్ల లాకప్ డెత్‌పై యాక్షన్.. ఆ ఇద్దరూ ఔట్..?
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 11న నెల్లిమర్ల పోలీసుస్టేషన్ లో ఓ దొంగతనం కేసులో పట్టుబడిన నిందితుడు రాంబాబు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. చోరీ కేసులో అరెస్టయిన రాంబాబు లాకప్ లోనే మృతి చెందడం విజయనగరం జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ రాంబాబు ఎవరంటే.. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ నివాసి. ఆయన ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషన్. జయనగరంలోని ఉపాధి హామీ పథకం కార్యాలయంలో బ్యాటరీలు పోయాయి. ఈ చోరీ కేసులో రాంబాబును పోలీసులు అనుమానించి.. రాత్రి లాకప్ లో ఉంచారు. శుక్రవారం తెల్లవారేసరికి రాంబాబు లాకప్ లోనే చనిపోయాడు.
పోలీసులు మాత్రం రాంబాబు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. అది కూడా తెల్లవారుజామున 4గంటల సమయంలో రాంబాబు ఉరేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అతడు ఆత్మహత్య చేసుకోవడాన్ని డ్యూటీలో వున్న పోలీసులు గమనించి ఉన్నతాధికారులకు విషయం చెప్పారట. ఇప్పుడు ఈ లాకప్ డెత్ పై అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ విషయం జిల్లాలో సంచలనం సృష్టించడంతో విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వెంటనే ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామని తెలిపారు.
విచారణ ఇంకా ఓ కొలిక్కి రాకపోయినా.. చోరీ కేసులో అనుమానితుడిగా వున్న రాంబాబును చితకబాదడం వల్లే చనిపోయాడని భావిస్తున్నారు. రాంబాబు చనిపోవడంతో పోలీసులు ఆత్మహత్య అంటూ నాటకం ఆడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.