అమరావతి : ఉద్యోగ సంఘాల్లో ఇన్ని ట్విస్టులా ?

Vijaya


బిడ్డపోయినా పురిటికంపు వదల్లేదనే సామెతను ఇక్కడ చెప్పుకోవటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ క్షేత్రస్ధాయిలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమ్మె విరమణ వ్యవహారం ఇలాగే ఉంది. పీఆర్సీ వివాదంపై 6వ తేదీ అర్ధరాత్రి నుండి నిర్వాహించాలని అనుకున్న సమ్మెను పీఆర్సీ సాధన సమితి విరమించుకున్నది. శనివారం రాత్రి మంత్రుల కమిటి-పీఆర్సీ సాధన సమితి నేతల మధ్య జరిగిన చర్చలు సక్సెస్ కావటంతో సమ్మెను  విరమించారు.



ఇంతవరకు బాగానే ఉందికానీ ఆదివారం ఉదయం నుండి ఉపాధ్యాయవర్గాలు ఎదురుతిరగటం మొదలుపెట్టారు. మెరుగైన పీఆర్సీ ప్రకారం తాము ఆందోళనలు చేస్తునే ఉంటామన్నారు. పీఆర్సీ సాధనసమితి నేతలు ప్రభుత్వానికి అమ్ముడుపోయారంటు రచ్చ రచ్చ చేస్తున్నారు. చూస్తుంటే ఉద్యోగుల సంఘాలతో సంబంధంలేకుండా ఉపాధ్యాయుల సంఘాలే సమ్మె చేసేట్లున్నాయి. వీరికి ఉపాధ్యాయ ఎంఎల్సీలు పూర్తి మద్దతిస్తున్నారు.



అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు కూడా సమ్మె చేయటానికి రెడీ అవుతున్నారు. పీఆర్సీ సాధన సమితి నేతల వైఖరిని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నేతలు తప్పుపడుతున్నారు. తమ ప్రయోజనాలను పీఆర్సీ సాధన సమితి నేతలు పణంగా పెట్టారంటు మండిపోతున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే ఉపాధ్యాయ+కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం సమ్మె విషయంలో ఏకమయ్యేట్లున్నాయి. ఇదే జరిగితే పీఆర్సీ వివాదం మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు ఈ పీఆర్సీ సాధన సమితి నేతలు ఏమి చేస్తారు ? మిగిలిన ఉద్యోగులు ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. అప్పుడు ప్రభుత్వానికి ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య ఎవరుంటారు .



ఇదే సమయంలో ఉపాధ్యాయసంఘాలపై పీఆర్సీ సాధన సమితి నేతల్లో ఒకరైన సూర్యనారాయణ విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయులు రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నట్లుందంటు మండిపోయారు. ఉపాధ్యాయ ఎంఎల్సీలు ఓట్లకోసమే ఉపాధ్యాయులను రెచ్చగొడుతున్నారంటు చేసిన ఆరోపణలతో మంటలు మొదలయ్యాయి. మొత్తానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల్లో ట్విస్టులు మొదలయ్యాయి. వ్యవహారం చూస్తుంటే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో చీలికలు తప్పేట్లు లేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: