పీఆర్సీ పోరులో సజ్జల బలిపశువు అయ్యారా..?

Deekshitha Reddy
చలో విజయవాడ కార్యక్రమంలో ఒకటే నినాదం.. హూ ఈజ్ సజ్జల అనే టాపిక్ బాగా హైలెట్ అయింది. టీడీపీ అనుకూల మీడియా ఈ పాయింట్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒకరకంగా సజ్జలను టార్గెట్ చేస్తూ ఉద్యోగుల వాయిస్ తీసుకుని ప్రసారం చేశారు. ఇప్పటికే సజ్జలను సకల జనుల శాఖ మంత్రిగా టీడీపీ అభివర్ణిస్తూ ట్రోల్ చేస్తోంది. తాజాగా ఉద్యోగ సంఘాల పీఆర్సీ నిరసనల్లో కూడా అదే విషయాన్ని హైలెట్ చేశారు.

అప్పటి వరకూ పీఆర్సీ గొడవలో మంత్రులెవరూ పెద్దగా మాట్లాడలేదు, వారికి మాట్లాడే అవకాశమే లేదు. కానీ చలో విజయవాడ రోజున హడావిడిగా ఆరుగురు మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలకు హితబోధ చేశారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది, మీరు రండి మాట్లాడుకుందాం, పంతాలకు పోతారెందుకు అంటూ.. మంచిమాటలు చెప్పారు. మరి నిన్న మొన్నటి వరకూ వీరంతా ఎక్కడికి వెళ్లారు. కనీసం పీఆర్సీపై వేసిన మంత్రుల కమిటీలో కూడా ఆయా మంత్రుల వాయిస్ ఎందుకు వినిపించలేదు, కేవలం సజ్జల మాత్రమే ఎందుకు మీడియా ముందుకొస్తున్నారు.

ఒకరకంగా పీఆర్సీ పోరులో సజ్జల బలిపశువు అయ్యారని అంటున్నారు. ఉద్యోగులంతా సీఎం జగన్ కంటే ఎక్కువగా సజ్జలను టార్గెట్ చేస్తున్నారు. తమని మోసం చేశారని, చర్చలకు పిలిచి అవమానించారని, అసలు ఆ మాటకొస్తే సజ్జల ఎవరని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న వ్యక్తి.. అన్నీ తానై వ్యవహరిస్తే ఇక మంత్రులు, ప్రభుత్వం ఎందుకని అడుగుతున్నారు. ఒకరకంగా సీఎం జగన్ కి ఇవేవీ తెలియవని, ఆయన దాకా తమ విషయాలు చేరడంలేదనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో సజ్జలని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే రేపు ఉద్యోగులు, ప్రభుత్వం ఒకే తాటిపైకి వచ్చినా మధ్యలో సజ్జల ఇమేజ్ పై మాత్రం మరకపడిపోయింది. రాష్ట్ర మంత్రులు కూడా సజ్జలతో ఇబ్బంది పడుతున్నారా.. ఆయన పెత్తనాన్ని మౌనంగా భరిస్తున్నారా అనేది ముందు ముందు తేలిపోతుంది.

చలో విజయవాడ తర్వాత పీఆర్సీ రగడ మరింత ముదిరేలా కనిపిస్తోంది. అటు ప్రభుత్వం మెట్టు దిగేలా లేదు. చీకటి జీవోల రద్దు అంటూ ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. ఇటు ఉద్యోగులు సమ్మెకు రెడీ అంటున్నారు, ఆర్టీసీ కూడా సమ్మెసు సై అంటోంది. ఈ దశలో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: