జగన్ జమానా: ఇళ్ల పట్టాలు వెనక్కిచ్చేయండి..

Deekshitha Reddy
ఇప్పటికే ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై అక్కడక్కడా అసంతృప్తి బయటపడుతోంది. సంక్షేమ పథకాలకు నిధులు భారీగా ఖర్చు చేస్తున్నా.. రోడ్లు వేయడంలేదనే అపవాదు ఉంది. నిర్మాణ రంగానికి చెందిన సామగ్రి రేట్లు భారీగా పెరిగిపోయాయని, సామాన్యులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందనే విమర్శ కూడా ఉంది. ఇక నిత్యావసరాల రేట్ల సంగతి సరే సరి. ఈ దశలో ఇప్పుడో కొత్త వివాదం మొదలైంది. జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇచ్చిన పట్టాలను కొంతమంది అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట నిర్మాణ పనులు మొదలు కాకపోవడంతో.. హౌసింగ్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ దశలో పేదలు ముందుకు రాకపోవడంతో వారి వద్ద స్థలాల పట్టాలు వెనక్కి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఓ దశలో వాలంటీర్లతో పట్టాలు కూడా వెనక్కి తెప్పించుకున్నారు.

ఇంటి పట్టాలు ఇచ్చేది ఎవరికి..?
నిరుపేదలకు జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల పట్టాలు ఇచ్చింది ప్రభుత్వం. ఊరికి దూరంగా ఇచ్చారని, ఇళ్ల నిర్మాణం అనువుకాని ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారని మొదట్లో విమర్శలొచ్చాయి. కానీ పేద ప్రజలు మాత్రం తమ పేరుతో పట్టా వస్తుందని మురిసిపోయారు. ఎక్కడైతేనేం.. జానెడు జాగా దొరికిందని సంతోష పడ్డారు. స్థలం ఉచితంగా ఇవ్వడమే కాదు, ఇల్లు కూడా ప్రభుత్వ సాయంతో కట్టిస్తామనే సరికి ఆ ఆనందం రెట్టింపైంది. అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. ఇల్లు కట్టించి ఇస్తామన్నారు సరే, దానికి లబ్ధిదారుల వాటా దగ్గరే పేచి మొదలైంది.

అందరికీ ఇల్లు కట్టుకునే స్థోమత ఉంటుందా, పోనీ కట్టుకుందామనుకున్నా ఇప్పుడున్న రేట్లతో ఎవరూ సాహసం చేయడంలేదు. అసలు ఆ డబ్బులే ఉంటే, స్థలమే కొనుక్కుంటారు కదా. మరి ఈ విషయంపై అధికారులు ఏమనుకున్నారో, ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ, ఇంటి నిర్మాణం చేయలేనివారు వెంటనే పట్టాలు వెనక్కిచ్చేయండి అంటూ హౌసింగ్ అధికారులు ఆదేశాలిచ్చారు. వాలంటీర్ల ద్వారా ఆ పట్టాలు వెనక్కి తెప్పించుకున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. కలెక్టర్ గారూ.. మాకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదు, కనుక మా పట్టా వెనక్కి ఇస్తున్నాం.. తీసుకోండి అంటూ ఓ కాగితంపై సంతకం కూడా తీసుకుంటున్నారు. దీంతో లబ్ధిదారుల్లో వ్యతిరేకత మొదలైంది. ఇదంతా ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే జరుగుతుందా..? లేక అధికారులపై ఒత్తిడితో వారు ఇలా చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. మొత్తమ్మీద ఇంటి పట్టాలు వెనక్కి తీసుకోవడంపై మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: