సీనియర్ సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి ఇవాళ జయలలిత సన్నిహితురాలు అయినటువంటి అన్నాడీఎంకే మాజీ అధినేత్రి వీకే శశికళ (చిన్నమ్మ)తో భేటీ అయ్యారు. శశికళ స్వగృహంలో రాములమ్మ చిన్నమ్మను కలిసారు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితుల దృస్ట్యా వీరిద్దరి తాజా కలయిక మరొకసారి ప్రాధాన్యం సంతరించుకున్నది. తాజాగా ఇరువురు రాజకీయ పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తోంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంటే రాములమ్మకు తొలి నాళ్ల నుంచే అభిమానం ఉంది. తాను రాజకీయాలలోకి రావడానికి జయలలిత రోల్ మోడల్ అని చాలా సార్లు చెప్పారు విజయశాంతి. అదేవిధంగా శశికళతో విజయశాంతికి చాలా సన్నిహిత సంబంధాలున్న విషయం విధితమే. ముఖ్యంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో శశికళను పలుమార్లుకలిసారు. ముఖ్యంగా జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా భేటీ అయ్యారు. మరొకమారు బెంగుళూరు కారాగారంలో శశికళ ఉన్న సమయంలో కూడా విజయశాంతి భేటీ అయినట్టు సమాచారం.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తరుణంలో విజయశాంతి కలిసారు. అంతేకాదు.. జయలలిత అనారోగ్యంతో ఉన్న సమయంలో శశికళ తమిళనాడుకు సీఎం అయితే బాగుంటుందని కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఆర్.కే.నగర్‌కు జరిగిన ఉపఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్‌కు మద్దతుగా విజయశాంతి ప్రచారం కూడా నిర్వహించిన విషయం అందరికీ తెలిసినదే. ముఖ్యంగా విజయశాంతికి తమిళనాడుకు చాలా ప్రత్యేక అనుబంధం ఉన్నది. తమిళ సినిమాతోనే వెండి తెరపై అడుగు పెట్టింది రాములమ్మ. టాలీవుడ్లో హీరో రేంజ్లో తెలుగు ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పేరుతో ఒక పార్టీని పెట్టి.. కాలక్రమేణా దానిని టీఆర్ఎస్ లో విలీనం చేసారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో చిన్నమ్మతో విజయశాంతి భేటి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.