చలో విజయవాడ: విజయం ఉద్యోగులదా..? ప్రభుత్వానిదా..?

Deekshitha Reddy
రేపు చలో విజయవాడ కార్యక్రమం కోసం ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై ఇప్పుడు రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉద్యోగులు ఈరోజు రాత్రి నుంచే చలో విజయవాడ అంటున్నారు. వాహనాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు విజయవాడ పోలీస్ కమిషనర్ కి కూడా అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కానీ విజయవాడ సీపీ కాంతిరాణా టాటా.. ఉద్యోగ సంఘాల సభకు అనుమతి లేదని ఖరాఖండిగా చెప్పేశారు. నగరంలో 144 సెక్షన్ అమలులో ఉందని, కొవిడ్ నిబంధనలు ఉన్నాయని.. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వస్తే కుదరదని చెప్పేశారు.

ఉద్యోగులేమంటున్నారు..?
చర్చలకు పిలిచి తమని అవమానించారంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఫైరవుతున్నారు ఉద్యోగులు. ఉద్యమ కార్యాచరణలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. చలో విజయవాడ విజయవంతం చేస్తామని, బెజవాడలో తమ సత్తా చూపిస్తామంటున్నారు. లక్షలాదిగా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే సందేశాలు వెళ్లిపోయాయి. ఇక టైమ్ దగ్గరపడుతోంది. కార్యాచరణ మాత్రమే మిగిలుంది. ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు, ప్రభుత్వం అంతకంటే ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలనుకుంటోంది.

పంతాలు.. పట్టింపులు..
చలో విజయవాడ కార్యక్రమం అనుకున్నట్టు జరిగితే, ఉద్యోగుల ఉద్యమ ఉధృతి మరింత ఎక్కువగా ప్రచారంలోకి వస్తుంది. అదే జరిగితే ప్రభుత్వానికి అది ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఉద్యోగులు తలపెట్టిన కార్యక్రమాన్ని నయానో భయానో అడ్డుకోవాలనుకుంటోంది ప్రభుత్వం. ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు ఉద్యోగుల్ని పిలిపించుకుని మాట్లాడారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. చలో విజయవాడ విరమించుకోవాలన్నారు. అటు పోలీసులు కూడా హౌస్ అరెస్ట్ లకు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నేతల్ని నిలువరించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు చలో విజయవాడ అనేది టాక్ ఆఫ్ ఏపీగా మారింది. ఉద్యోగులు గెలుస్తారా, ప్రభుత్వానిదే విజయమా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇరు వర్గాలు పంతాలకు, పట్టింపులకు పోతుండటంతో అసలు నిరసనల తుది రూపు ఎలా ఉంటుందోననే ఆందోళనలు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: